Tuesday, November 26, 2024

మార్చి 6 నుంచి ఉమెన్స్‌ టీ20 లీగ్‌.. జనవరి 16న ప్రసార హక్కుల వేలం

ఉమెన్స్‌ ఐపీఎల్‌ ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న క్రీడాభిమానులకు శుభవార్త. ఉమెన్స్‌ ఐపీఎల్‌కి బదులుగా ఉమెన్స్‌ టీ20 లీగ్‌గా మార్పు చేశారు. ఉమెన్స్‌ టీ20 లీగ్‌ మార్చి 6వ తేదీ నుంచి 26 వరకూ జరుగనుంది. ముంబై, పుణ, నాగ్‌పూర్‌ వేదికల్లో ఈ లీగ్‌ టోర్నీ నిర్వహించనున్నారు. తొలి సీజన్‌లో ఐదు లేదా ఆరు జట్లతో టోర్నమెంట్‌ జరగనుంది. ఈ లీగ్‌కు సంబంధించి ప్రసార హక్కుల వేలం జనవరి 16న నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ప్రాంచైజీలను ఎంపిక చేసి, క్రీడాకారుల జాబితాను తయారు చేయనున్నారు. వుమెన్స్‌ టీ20 లీగ్‌కు క్రీడాకారులను వేలం ద్వారా నిర్వహించబోతున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల బేస్‌ ప్రైజ్‌ వరకూ ప్లేయర్లు వేలంలోకి వస్తారు.

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల బేస్‌ ప్రైజ్‌ రూ.10-20 లక్షలుగా ఉంటే, క్యాప్డ్‌ ప్లేయర్ల బేస్‌ ప్రైజ్‌ రూ.30-50 లక్షలుగా నిర్ణయించారు. తొలి సీజన్‌ కావడంతో డ్రాఫ్ట్‌ పద్ధతిని అమలు చేసేందుకు బీసీసీఐ మొగ్గుచూపించడం లేదు. దీంతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన వంటి స్టార్‌ ప్లేయర్లు కూడా వేలంలో పాల్గొనబోతున్నారు. వుమెన్స్‌ టీ20 లీగ్‌లో పాల్గొనాలని అనుకునే ప్లేయర్లు అందరూ ఆయా రాష్ట్రాల క్రికెట్‌ బోర్డుల ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 26 వరకూ రిజిస్ట్రేషన్‌కి గడువు ఉంది. రిజిస్ట్రేషన్‌ తర్వాత పురుషుల ఐపీఎల్‌ మాదిరిగానే సెట్స్‌ మాదిరిగా ప్లేయర్ల వేలం జరుగుతుంది. ఫిబ్రవరి 11న వేలం నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వంటి ఐపీఎల్‌ టాప్‌ ఫ్రాంచేజీలన్నీ వుమెన్స్‌ టీ20 లీగ్‌లో జట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. దీంతో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం కూడా పురుషుల ఐపీఎల్‌ లెవెల్‌లో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement