Tuesday, November 26, 2024

Women’s Reservation Bill – 30 ఏళ్ల నిరీక్షణకు తెర. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

న్యూ ఢిల్లీ : భారతదేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు కు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ఎగువసభలోనూ సుదీర్ఘంగా చర్చించారు.నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చారిత్రక బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దాదాపు 10 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఆటోమేటిక్‌ ఓటు రికార్డింగ్‌ వ్యవస్థ ద్వారా ఓటింగ్‌ చేపట్టారు. ప్రతి సభ్యుడి వద్ద ఉన్న మల్టీ మీడియా డివైజ్‌ సాయంతో ఓటింగ్‌ జరిపారు.ఈ బిల్లుకు మద్దతుగా 215 మంది సభ్యులు ఓటు వేశారు. ఎవరూ వ్యతిరేకించలేదు. దీంతో చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీంతో ఉభయసభల్లోనూ ఆమోదం పొందినట్లయింది. దాదాపు మూడు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడినట్లయింది

మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించడంతో ఇక చట్టంగా మారడం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిసభ్యుడికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ బిల్లుపై రాజ్యసభలో చేపట్టిన చర్చలో ఉభయ సభల నుంచి వివిధ పార్టీలకు చెందిన 132 మంది సభ్యులు భాగస్వాములయ్యారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ చర్చలోని ప్రతి పదం రాబోయే ప్రయాణంలో మనందరికీ ఉపయోగపడుతుందని.. ప్రతి విషయానికి దాని సొంత ప్రాముఖ్యత, విలువ ఉంటాయని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement