క్రికెట్ అభిమానులకు శుభవార్త. వచ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బీసీసీఐ కార్యదర్శి జయ్ షా నేతృత్వంలో 2023 నుంచి ఉమెన్స్ ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహణకు కార్యాచరణ సిద్ధమవుతోంది. బుధవారంనాడిక్కడ బీసీసీఐ సమావేశం అనంతరం కార్యదర్శి జై షా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దేశీయంగా క్రికెట్‌ను మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే 2023 నుంచి ఉమెన్స్ ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వచ్చే ఐదేళ్లకు మీడియా ప్రసార హక్కులు రూ.48,390 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పడు క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ జోష్ మరింత పెంచేలా బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇకపై కేవలం ఐపీఎల్ కోసం అన్ని క్రికెట్ బోర్డులు ప్రత్యేక షెడ్యూల్‌ను కేటాయించేలా తీర్మానించింది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపిందని బీసీసీఐ వెల్లడించింది. ఐసీసీ తయారు చేసే తదుపరి క్యాలెండర్‌లో ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రెండున్నర నెలలు కేటాయించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. అంతేగాక ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య 94కు పెంచనున్నట్లు తెలిపారు. ఐపీఎల్‌లో రాబోయే ఐదేళ్ల కాలానికి అంటే 2023 నుంచి 2027 వరకు మీడియా ప్రసార హక్కుల వేలం ముగిసింది. ఈ రైట్స్ రూ.48,390 కోట్లకు అమ్మడుపోయాయి.
దీంతో టీ20 లీగ్ ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన లీగాగా ఎదిగింది. మీడియా హక్కుల వేలం ద్వారా భారీ ఆదాయం రావడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హర్సం వ్యక్తం చేశారు. క్రికెట్ అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది ప్రతిభకు సంబంధించినది అని పేర్కొన్నారు. యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది మంచి ప్రేరణ ఇస్తుందని, తద్వారా భారత జట్టుకు మేలు జరుగుతుందన్నారు. యువ ఆటగాళ్ల సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి, టీమిండియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. టీ20 మీడియా హక్కుల్లో ఉపఖండపు టీవీ ప్రసార హక్కులను మ్యాచ్‌కు రూ.57.5 కోట్ల చొప్పున రూ.23,575 కోట్లకు డిస్నీ స్టార్ కైవసం చేసుకుంది. ఇండియా డిజిటల్ హక్కులను రిలయన్స్ భాగస్వామి ‘వయాకామ్ 18’ రూ.20,500 కోట్లకు చేజిక్కించుకుంది. నాన్-ఎక్స్‌క్లూజివ్ ప్యాకేజీ ‘సి’ని కూడా వయాకామ్ 18 రూ.3,257.5 కోట్లకు సొంతం చేసుకుంది. ప్యాకేజీ ‘డి’ని రూ.1,058 కోట్లకు వయాకామ్ 18, ట్రైమ్స్ ఇంటర్నల్ దక్కించుకుంది. వీటిని బీసీసీఐ బుధవారంనాడు ప్రత్యేకంగా సమావేశమై ఆమోదం తెలిపినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.