తొర్రూరు : మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో మూడు వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు తొర్రూరులో తొర్రూరు మండలం, తొర్రూరు మున్సిపాలిటీ, పెద్ద వంగర మండలాల మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా తరగతులను మంత్రి ప్రారంభించారు. శిక్షణ పొందే మహిళలు, స్థానిక నేతలు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ వచ్చాక మహిళలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత పరిస్థితులను మహిళలు బేరీజు వేసుకోవాలన్నారు. నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి 7 సార్లు గెలిచాను, చాలా మంది సీఎంలను, పార్టీలను చూసాను, కానీ సీఎం కేసీఆర్ లా అభివృద్ధిని ఎవరూ చేయలేదన్నారు. నేను ఎమ్మెల్యే అయినప్పుడు నా నియోజక వర్గంలో, రాష్ట్రంలోని అక్కా, చెల్లెళ్ళు కుండలు పట్టుకుని నీళ్ళ కోసం నిలబడే వారు.. నీళ్లకు బోరింగ్ వేస్తే చాలు అనేవాళ్లు.. నా ఎమ్మెల్యే నిధులు అన్ని బోరింగ్ లకే పోయేవన్నారు. కానీ కేసిఆర్ 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరు ఇస్తున్నారు అన్నారు. ఈ మిషన్ భగీరథ శాఖ కూడా సీఎం నాకే ఇచ్చిండ్రు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు మాత్రమే కాదు, డ్వాక్రా మహిళలను అభివృద్ధి చేసే శాఖను కూడా నాకే ఇచ్చారన్నారు.
తెలంగాణ రాక ముందు మహిళలకు 4 వేల కోట్ల రూపాయల రుణాలు వచ్చేవి, ఇపుడు 18వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాం అన్నారు. అభయ హస్తం కింద డబ్బులు కట్టిన వారికి మిత్తితో కలిపి వాపస్ ఇస్తున్నాం. డబ్బులు కట్టిన వారికి 2వేల పెన్షన్ కూడా ఇస్తామన్నారు. హాస్టళ్ళలో బట్టలు కుట్టే పని వేరే వారికి ఇస్తున్నామని, మన మహిళలకు శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. సంగెం మండలంలో టెక్స్ టైల్ పార్క్ కు 10 వేల మంది అవసరం అన్నారు. కొడకండ్లలో కూడా మినీ టెక్స్ టైల్ పార్క్ వస్తుందని, వీటి వల్ల మహిళలకు ఉపాధి, ఉద్యోగం లభిస్తుందన్నారు. 3 నెలల తరవాత మరొక బ్యాచ్ మొదలు పెడుతామని, ఇది కంటిన్యూ గా జరిగే శిక్షణ కార్యక్రమం అన్నారు. జనగామలో మామిడి పండ్లు, సీతాఫలాలు, ఖమ్మం, మహబూబాబాద్ లో మహిళలు మిర్చి వ్యాపారం చేస్తున్నారు. మంచి లాభాలు వస్తున్నాయి మహిళలు వ్యాపార వేత్తలు కావాలన్నారు. పెన్షన్లు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా 2000 రూపాయాలు ఇవ్వడం లేదు. కోడళ్ళు అత్తకు 2000 వస్తె వారిని బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడాలేవు అన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ను అందించే కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని, లక్షా 25 వేల ఖర్చులో భారీ సబ్సిడీ ఉంది. కేంద్రం ప్రతి రైతు విద్యుత్ కనెక్షన్లను మీటర్లు పెట్టాలని చూస్తున్నది, సీఎం కెసిఆర్ అడ్డుకుంటున్నారు.