Sunday, November 17, 2024

Delhi | నారీశక్తికి నీరాజనం.. ఢిల్లీలో ఘనంగా మహిళా దినోత్సవం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలో తెవా (తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్)-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురుజాడ కాన్ఫరెన్స్ హాల్‍‌లో ఈ వేడుకలు జరిగాయి. తేవా అధ్యక్షురాలు సుశీల వరదరాజుతో పాటు ప్రత్యేక అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న, ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న తెలుగు, ఉత్తరాది మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏసీపీ సుమ, ఢిల్లీ టీటీడీ సభ్యురాలు శ్వేతారెడ్డి, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ విజయ రమా శేషారత్నం, ప్రపంచ ఆరోగ్య సంస్థలో జాతీయ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న లక్ష్మి చేతుల మీదుగా పలువురు మహిళలను సన్మానించారు. పురస్కారాలు అందుకున్న వారిలో సర్వేపల్లి రమా రోహిణి, డాక్టర్ నవీలా, నృత్య కళాకారిణులు పీవీ జానకి, రాఖీ చక్రవర్తి, సాహితీ పెండ్యాల, బహుముఖ ప్రజ్ఞాశాలి మున్నంగి కుసుమ, వీణా విద్యాంసురాలు వర్థని చామర్తి తదితరులు ఉన్నారు.

వారందరికీ శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం తేవా సభ్యులు ముఖ్య అతిథులను సాదరంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు నారీశక్తిపై వారు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఢిల్లీలోని తెలుగు ఉద్యోగుల సంక్షేమం కోసం 30 ఏళ్ల క్రితం మొదలైన తేవా సంస్థ నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని సుశీల వరదరాజు చెప్పుకొచ్చారు. రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ పలువురి ప్రతిభా పాటవాలను తమ వేదిక ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తేవాను ముందుండి నడిపిస్తున్న కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement