తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఇలాకాలో ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలను అధికారుల కూల్చివేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశాలతో అక్రమ కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు.. మంగళవారం కూల్చివేత పనులు చేపట్టారు. దీంతో చేర్యాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అధికారుల చర్యలపై చేర్యాల వాసులు తీవ్ర ఆందోళన చేపట్టారు. అప్పులు తెచ్చుకొని మరీ ఇళ్లు నిర్మించుకున్నామని.. కూల్చివేయొద్దు అంటూ పోలీసుల కాళ్లపై పడ్డారు. నోటీసులు ఇచ్చిన 24 గంటలలోపే వచ్చి కూల్చివేతలు ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ ఇంటిని కూల్చొద్దు అంటూ ఓ మహిళ ఏడుస్తూ.. కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను నిలువరించారు. మంత్రి హరీశ్ రావు ఈ వ్యవహారంపై స్పందించాలని బాధితులు కోరుతున్నారు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చిన తర్వాతే.. నిబంధనల ప్రకారం కూల్చివేత పనులు చేపట్టామని చెబుతున్నారు.