మహిళల ఆర్ధిక శక్తిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీ శక్తి అద్వితీయ పాత్ర పోషించిందని ప్రధాని ప్రశంసించారు. నేడు జరిగిన గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల్లో ప్రసంగిస్తూ ఈరోజు ప్రపంచంలోనే మనం అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఎదిగామని అన్నారు. భారత డెయిరీ రంగంలో ఎనిమిది కోట్ల మంది పనిచేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. మన డైరీ పరిశ్రమ టర్నోవర్ రూ. 10 లక్షల కోట్లకు ఎదిగిందని చెప్పారు.
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలంటే మహిళల ఆర్ధిక శక్తిని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 30 లక్షల కోట్ల విలువైన ముద్ర రుణాల్లో 70 శాతం లబ్ధిదారులు మహిళలేనని చెప్పారు. దేశంలో పదేండ్లుగా మహిళా స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళల సంఖ్య 10 కోట్లు దాటిందని తెలిపారు.
అన్నదాతల ఆందోళనల వేళ ప్రధాని మోదీ ట్వీట్
రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్రం చెరకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిన నేపథ్యంలో గురువారం ఆయన ఈ విధంగా స్పందించారు.దేశ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చారిత్రాత్మక నిర్ణయం వెలువడిందని చెప్పారు. చెరకు కొనుగోలు ధర పెంపునకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ చర్య వల్ల చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు. కాగా, తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో రైతులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో మోదీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.