ముంబై నగరంలో వర్షానికి భారీ వృక్షం నేల కూలుతుండగా.. ఓ మహిళ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన సోమవారం జరగ్గా.. ఎనిమిది సెకన్ల పాటు ఉన్న వీడియోలో ఓ మహిళ గొడుగు పట్టుకొని నడుస్తుండగా.. చెట్టు కూలిపోయి కొమ్మలు ఆమెపై పడబోయాయి. ఇది గమనించి మహిళ వెంటనే అప్రమత్తమై తప్పించుకుంది. ఈ సీసీటీవి ఫుటేజీని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది..
అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను పలు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసింది. గుజరాత్, ముంబైలో పెనుగాలులతో కురిసిన వర్షానికి భవనాలు దెబ్బతినగా.. భారీగా చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపడగా తీరని నష్టం కలిగింది. పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. సోమవారం తౌటే తుఫాను మహారాష్ట్రలో పెను విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, గంటకు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో వీచిన గాలులకు చెట్లు కూలిపోగా.. 2,500 ఇండ్లకు నష్టం కలిగింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 11 గంటల పాటు మూసివేయగా.. తుఫాను కారణంగా 230 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. మే నెలలో 24 గంటల్లో ఇంత వర్షాపాతం నమోదవడం చరిత్రలో ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.