– ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడంతో రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరికొంతమంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో బాధిత కుటుంబాలు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవ్వాల (సోమవారం) ఆందోళనకు దిగారు. దీంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్డుపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు మృతుల కుటుంబీకులతో చర్చలు జరిపి రూ. 5లక్షల పరిహారంతోపాటు డబుల్బెడ్రూం ఇళ్లు. పిల్లల చదువుకు భరోసా కల్పించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చొప్పున ఇద్దరికి చెక్కులు పంపిణీ చేశారు. మృతుల కుటుంబీకులు, బంధువుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మాడ్గుల, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలకు చెందిన 34మందికి ఈనెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఏరియా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ చేయించుకున్న తరువాత అందరినీ తమ ఇళ్లకు పంపించారు. ఇళ్లకు వెళ్లిన తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఏమాత్రం విరామం లేకుండా వాంతులు, విరేచనాలు కావడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరిని వేరువేరు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించగా ఇందులో మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి సు ష్మ (23) సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మాడ్గులకు చెందిన మమత (23) కూడా ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయింది. మరో ఇద్దరు మహిళలు మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. వీరిలో ఒకరు కూడా చనిపోయారన్న ప్రచారం జరిగింది. అధికారికంగా మాత్రం ధ్రువీకరించలేదు.
ఆపరేషన్‌కు ఉపయోగించిన పనిముట్ల శుభ్రం చేయకపోవడంతోనే..
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వినియోగించే పనిముట్లు శుభ్రం చేయకపోవడమే ఇద్దరి చావుకు కారణమా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఒకరికి ఆపరేషన్ చేసిన తరువాత పనిముట్లను స్టెరిలైజ్ (శుభ్రం) చేయకపోవడంతోనే ఇబ్బది వచ్చిందనే నిర్దారణకు అధికారులు వచ్చారు. ఒకరికి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పనిముట్లను పూర్తిగా స్టెరిలైజ్ చేసినాకనే మరొకరికి వినియోగించాల్సి ఉంటుంది. కానీ, అలా చేయకపోవడంతోనే ఇబ్బంది వచ్చిందని తెలుస్తోంది. ఎవరు అలా చేశారనే దానిపై విచారణ జరుగుతోంది. ఇందుకు కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.