Saturday, November 23, 2024

Delhi | ఆశావహుల్లో భారీగా మహిళలు.. ఎంపిక వేగవంతం చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతూనే ఉన్నారు. మరోవైపు అధిష్టానం కూడా గట్టిగానే కసరత్తు చేస్తోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నందున ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సీనియర్లు మంతనాలు సాగిస్తున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్, ప్రీతమ్‌తో పాటు మహిళా నేత సూరారపు కృష్ణ వేణి, మమత, పిడమర్తి రవి, జ్ఞాన సుందర్, రవి, మందుల సామెలుతో పాటు మొత్తం 25 మంది తుంగతుర్తి సీటు కోసం పోటీ పడుతున్నారు.

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని విశ్వాసం చేస్తుండడంతో ఎవరిని ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. సర్వేలు, సీనియర్ నేతల అభిప్రాయాలతో పాటు పలు రకాలుగా అధిష్టానం ఇప్పటికే సమాచారం సేకరించింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక, వడపోతలతో ఎన్నికల కమిటీకి సిఫారసులు చేసింది.

పోటీ అధికంగా ఉండడంతో ప్రజాదరణ, నియోజకవర్గంలో అందుబాటులో ఉండే నేతలు, అందరికీ ఆమోదయోగ్యమైన వివాదరహిత అభ్యర్థికే సీటు కేటాయించాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా స్థానిక అభ్యర్థి, నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న మాదిగ సామజిక వర్గం నుంచి మహిళా అభ్యర్థి ఎంపిక ద్వారా గెలుపు ఖాయమనే అభిప్రాయంతో కమిటీ ఉన్నట్టు సమాచారం. చివరకు ఏ సీటుకు ఏ అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement