Tuesday, November 26, 2024

మహిళను అక్రమంగా నిర్బంధించారని.. జీఎస్టీ అధికారులపై కేసు నమోదు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహిళను అక్రమంగా నిర్బంధించారన్న అభియోగంతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 27 ఫిబ్రవరి 2019 న పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలో నివసించే శ్రీధర్‌రెడ్డి అనే వ్యాపారి ఇంట్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.భరణి కమోడిటీస్‌ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీధర్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారనే అనుమానంతో అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన సమయంలో శ్రీధర్‌రెడ్డి ఇంట్లో లేరని, అతడి భార్య రాఘవిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనిఖీల అనంతరం తనను బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ కార్యాలయానికి తీసుకు వెళ్ళి రాత్రంతా అక్కడే ఉంచారని, రూ. 5 కోట్లు ఇస్తే ఎలాంటి కేసు లేకుండా చేస్తామని బెదరించారని రాఘవీరెడ్డి పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.

తనిఖీలకు సంబంధించిన ఎలాంటి ఆదేశాలు అధికారులు తనకు చూపకుండానే ఇంట్లో సోదాలు చేశారని, తనను బలవంతంగా జీఎస్టీ కార్యాలయానికి తీసుకువెళ్ళారని బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లోనే శ్రీధర్‌రెడ్డి జీఎస్టీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జీఎస్టీ అధికారులు లంచం డిమాండ్‌ చేసినట్లు గతంలోనే సీబీఐకి ఫిర్యాదు చేసినా ఆ మేరకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో అధికారులపై ఎలాంటి కేసు నమోదవలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement