ప్రభుత్వాలు పేదల వైద్యం కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నా.. సకాలంలో సరైన వైద్యం అందక అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఎదిగిన ప్రాణం బయటకు రాగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. నెలలు నిండిన గర్భిణి ఆస్పత్రికి దగ్గర్లోనే కళ్లు తిరిగి పడిపోయింది. ఆ సమయంలోనే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో రోడ్డు పక్కనే ప్రసవం అయింది. పుట్టిన కొద్ది సేపటికే పసికందు ప్రాణాలు పోయాయి. ఇదంతా ప్రభుత్వ ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలోపే జరిగినా… ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్లో జరిగింది.
మేడ్చల్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం బాలాజీ నగర్‌లోని పీహెచ్సీ సమీపంలో కళ్లు తిరిగి పడిపోయింది. నిండు గర్భిణి రోడ్డుపై పడి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఆమెకు అక్కడే ప్రసవం అయింది. ఓ యువకుడు గమనించి పక్కనే ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి చెప్పే ప్రయత్నం చేయగా, అక్కడ డాకర్ట్ లేరని సమాధానం చెప్పారు. ఆస్పత్రిలోనే ఉన్న 108, 104 డ్రైవర్లను ఆస్పత్రిలోకి తీసుకెళ్లాలని కోరినా డాక్టర్ లేకుండా తామేం చేయలేమన్నారని చెప్పినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఈ మొత్తాన్ని అతడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం జవహర్ నగర్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు 108ను తీసుకుని అక్కడికి వెళ్లారు. అప్పటికే పసికందు మరణించింది. లక్ష్మిని 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రసవమైన తరువాత గంటకుపైగా ఎవరూ పట్టించుకోలేదని, పుట్టిన బిడ్డ మరణించడానికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు అంటున్నారు.