Wednesday, November 27, 2024

కోడలు ఉరివేసుకుంటుంటే.. వీడియో తీసిన అత్తమామలు

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కోడలు ఉరివేసుకుంటుంటే ఆపాల్సింది పోయి అందుకు సంబంధించిన దృశ్యాల‌ను అత్త, మామలు వీడియో తీశారు. కోడలి ఆత్మ‌హ‌త్య ఉదంతంతో త‌మ ప్రమేయం లేద‌ని చెప్పేందుకు ఇలా వీడియో సాక్ష్యాన్ని రూపొందించారు. అనంత‌రం ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేశారు. యూపీలోని ముజఫర్‌ డాటియానా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కోమల్ అనే అమ్మాయితో ఆశిష్ అనే అబ్బాయికి 2019లో వివాహం జరిగింది. ఆ స‌మ‌యంలో కోమల్ తల్లిదండ్రులు క‌ట్నంగా రూ.5 లక్షల న‌గ‌దు, ఒక బైక్‌ని ఇచ్చారు.

అయినా ఇంకా క‌ట్నం కావాల‌ని ఆరు నెలలుగా ఆశిష్ త‌ల్లిదండ్రులు కోడ‌లిని వేధిస్తున్నారు. అద‌న‌పు క‌ట్నం తీసుకురాక‌పోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆశిష్‌తో క‌లిసి ఆమెను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. దీంతో కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ‌ పెద్దలు ఆమెకు నచ్చజెప్పడంతో తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. ఆమెను అత్తమామలు మళ్లీ వేధించడంతో త‌ట్టుకోలేక‌పోయిన ఆమె గ‌దిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమెను ఆప‌కుండా ఆ దృశ్యాల‌ను కిటికీలో నుంచి చిత్రీకరించిన అత్త, మామ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement