హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమల్లో భాగంగా ఫిబ్రవరి నెలకు గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.227 కోట్ల 50 లక్షలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం కేటాయించిన 227.50 కోట్ల నిధుల్లో రూ.210 కోట్ల 44 లక్షలు గ్రామ పంచాయితీలకు, రూ.11 కోట్ల 37 లక్షలు మండల పరిషత్‌లకు, రూ.5 కోట్ల 69 లక్షలు జిల్లా పరిషత్‌లకు ప్రతినెలా గ్రాంటుగా నిధులను ఇస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద 2019 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.8,569 కోట్ల 50 లక్షలు గ్రాంటుగా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేశామని మంత్రి చెప్పారు. కేంద్రం నుంచి 2021-22 సంవత్సరంలో మొదటి విడతగా రూ.682 కోట్ల 50 లక్షలు విడుదలయ్యాయని ఆయన చెప్పారు.
కేంద్రం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ఇంత వరకు రెండో విడత నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు విడుదల చేసిందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. గ్రామ పంచాయతీలకు గ్రాంటు విడుదల చేయగానే సంబంధిత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, జిల్లా పంచాయతీ అధికారులకు సమాచారం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. మండల పరిషత్‌లకు నిధులు విడుదల చేయగానే సంబంధిత మండల పరిషత్ అధ్యక్షులకు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సమాచారం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా ప్రజా పరిషత్‌లకు నిధులు విడుడల చేయగా సంబంధిత జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లకు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారాన్ని పంపిస్తున్నాని దయాకర్‌రావు చెప్పారు. గ్రామీణ, స్థానిక సంస్థల నిధుల విడుదలలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని ఆయన వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..