Saturday, November 23, 2024

Tamilnadu: తమిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌కు సుప్రీం క్లాస్ … మూడేళ్లు ఎందుకు పెండింగ్‌లో పెట్టార‌ని నిల‌దీత‌

తమిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌కు సుప్రీం క్లాస్ … మూడేళ్లు ఎందుకు పెండింగ్‌లో పెట్టార‌ని నిల‌దీత‌

రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా మూడేళ్లుగా ఏం చేశార‌ని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

బిల్లులకు ఆమోదం తెలపకుండా తమిళనాడు గవర్నర్ మూడేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మరోవైపు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బిల్లుల ఆమోదానికి జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని నోటీసుల్లో ఆదేశించింది. కేరళ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించిన వివరాలను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. గత 21 నెలలుగా ఎనిమిది బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement