Saturday, November 23, 2024

వంట గ్యాస్‌పై కేంద్రం సబ్సీడీ ఎత్తివేత.. 1070కి చేరిన సిలిండర్‌ ధర..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం సబ్సీడీని పూర్తిగా ఎత్తివేయడంతో వంట గ్యాస్‌ భారమవుతోంది. డొమాస్టిక్‌ (గృహ వినియోగదారులు)కు ఇచ్చే వంట గ్యాస్‌ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రాష్ట్రంలో వంట గ్యాస్‌ ధర రూ.1070కి చేరింది. మూరుమూల పెద్దపల్లి, జగిత్యాల తదితర జిల్లాల్లో ఈ ధర రూ.1075 నుంచి రూ. 1085దాకా చేరింది. ఇప్పటికే వంట నూనెలు మొదలు అన్ని నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో వంట గ్యాస్‌ పైనా సబ్సీడీ ఎత్తివేయడంతో ఇంటిని నెట్టుకురావడం భారంగా మారిందని గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్‌ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీని పూర్తిగా ఎత్తివేసింది. కేవలం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన సిలిండర్లు తీసుకున్న వినియోగదారులకు మాత్రమే రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

వాస్తవానికి వంట గ్యాస్‌ సిలిండర్‌పై 2010 వరకు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎలాంటి రాయితీని అందించలేదు. ఆ తర్వాత సిలిండర్‌ ధరను రూ.340 నుంచి రూ.425కు పెంచిన కేంద్రం… రాయితీ కింద రూ.85 ఇస్తున్నట్లు ప్రకటించింది. అలా 2010 తర్వాత గ్యాస్‌ ధర పెరిగినపుడల్లా స్టాండర్డ్‌ రేటును నిర్ణయించుకుని… మిగతా సొమ్మును వినియోగదారులకు ఇస్తోంది. కొవిడ్‌ సమయం నుంచి వంట గ్యాస్‌పై ఇచ్చే రాయితీని క్రమక్రమంగా తగ్గిస్తూ చివరకు సంపూర్ణంగా ఎత్తివేసింది. వంట గ్యాస్‌ సబ్సీడీ ఎత్తివేయడంతోపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగిపోయాయి. వీటికితోడు చదువులకు ఫీజులు, వైద్య ఖర్చులు ఇలా కుటుంబాలను సాకడం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం కోటి 4లక్షల కుటుంబాలు ఉండగా… గ్యాస్‌ కనెక్షన్లు కూడా కోటికి పైగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్‌ సబ్సీడీ ఎత్తేయడంతో ఈ కుటుంబాలన్నీ ఆర్థికభారాన్ని మోయాల్సి వస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement