హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష రాసిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం బంపర్‌ఆఫర్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఆయా అభ్యర్థులకు 7 మార్కులు అదనంగా కలవనున్నరాయి. దీంతో అనేకమంది తదుపరి పరీక్షలకు అర్హత సాధించనున్నారు. క్వాలిఫై అయిన అభ్యర్థుల పేర్లను సోమవారం నుంచి వెబ్‌సైట్‌లో పోలీసు నియామకబోర్డు అందుబాటులో ఉంచనుంది. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు పార్ట్ -2 అప్లికేషన్ సమర్పించేందుకు పాత హాల్‌టికెట్ల నంబర్లతోనే అభ్యర్థులు లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఫిబ్రవరి 15న వారందరికీ ఫిజికల్ టెస్టులను నిర్వహించనుంది. రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో రాతపరీక్ష ఫలితాలపై పోలీసు నియామక బోర్డు ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో ఏడు ప్రశ్నలకు సంబంధించిన అంశంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హైకోర్టు ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమనరీ రాతపరీక్షల్లో మల్టిపుల్ ప్రశ్నల విషయంలో అందరికీ మార్కులు కలపాలని ఆదేశించింది.
దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు నియామక బోర్డు ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. కోర్టు ఆదేశాల మేరకు ఉత్తీర్ణులైన వారందరికీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకుగాను గతంలో ఉన్న హాల్‌టికెట్ నంబర్లతోనే మరోసారి లాగిన్ అయ్యేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నియామక బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం ప్రిలిమనరీ పరీక్షలో ఉత్తీర్ణులై ఇప్పటికే ఫిజికల్ టెస్టులు పూర్తి చేసుకున్నవారికి మరోసారి రావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అదేవిధంగా ఫిజికల్ టెస్టులో అర్హత సాధించని అభ్యర్థుల అంశంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసు నియామకబోర్డు వెల్లడించింది.
కోర్టు ఆదేశాల మేరకు ప్రిలిమనరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 1న ఉదయం 8 గంటల నుంచి 5వతేదీ రాత్రి 10 గంటల వరకు దేహదారుఢ్య పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 15న ఆయా అభ్యర్థులందరికీ పోలీసు నియామకబోర్డు ఫిజికల్ టెస్టులను నిర్వహించనుంది. ఫిజికల్ టెస్టుల కోసం హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్‌లలోని పోలీసు గ్రౌండ్‌లలో పది రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మరోసారి ఫిజికల్ టెస్టు అవసరం లేదని బోర్డు తెలిపింది. కాగా ప్రస్తుత ఫిజికల్ టెస్టుల్లో ఎత్తు విషయంలో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థుల విషయంలో ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని వెల్లడించింది.
రాష్ట్రంలో ఉద్యోగ భర్తీ ప్రక్రియలో భాగంగా సీఎం కేసీఆర్ 80వేల ఖాళీలను పూరించేలా నిర్ణయించారు. ఈ క్రమంలో పోలీసుశాఖలో గతేడాది ఏప్రిల్ 25న 554 ఎస్సై, 15644 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 28న 614 ఎక్సైజ్ కానిస్టేబుల్, 63 రవాణా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమనరీ పరీక్షల్లో 5, 07,890 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫిజికల్ టెస్టుల కోసం 4, 63, 970 మంది హాజరయ్యారు. ప్రిలిమనరీ రాతపరీక్షల్లో 9 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల వ్యవహారంలో వివాదం రాజుకుంది. సిలబస్‌లో లేని కారణంగా రెండు ప్రశ్నలకు మార్కులు కలిపారు. అయితే మిగిలిన ఏడు ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు, రెండు సరైన సమాధానాలు ఉండడంతో ఇబ్బందులు నెలకొన్నాయి.
ఈ ప్రశ్నలకు ఏదో ఒక సరైన సమాధానం పెట్టినవారు, ఎటువంటి సమాధానం పెట్టకుండా వదిలేసిన వారికి నిపుణుల కమిటీ సూచనల మేరకు పోలీసు నియామక బోర్డు మార్కులను జతచేసింది. ఆయా ప్రశ్నలకు రెండు సరైన సమాధానాలు కాకుండా తప్పు సమాధానాలు ఎంచుకున్న వారికి మార్కులు కలపకుండా తప్పుడు సమాధానాలుగా పరిగణించింది. అయితే తప్పుడు సమాధానాలకు మైనస్ మార్కులు ఉండడంతో ఈ ఏడు ప్రశ్నలతో అనేక మంది ఉత్తీర్ణత కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు నియామక బోర్డు అమలు దిశగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు అవకాశాన్ని విస్తృతం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.