హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశన్నంటాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బియ్యం కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. 25 కిలోల బియ్యం బస్తాపై రూ.150 నుంచి రూ.200 వరకు పెరిగాయని గగ్గోలు చెందుతున్నారు. కిలో బియ్యం కొనాలంటే రూ.40 నుంచి రూ.55 వరకు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై 5శాతం జీఎస్టీ విధించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. బియ్యంపై కూడా 5శాతం జీఎస్టీ విధించడంతో 25 కిలోల బస్తా బియ్యం ధరను వ్యాపారులు అమాంతం పెంచేశారు. గతంలో రకాన్ని బట్టి 25 కిలోల బస్తా రూ.1200 నుంచి రూ.1300 పలకగా ప్రస్తుతం ఆ ధర రూ.1500కు పైగా చేరుకుందని , ఇక సన్నబియ్యం కొనుక్కుని తినే పరిస్థితి లేకుండా పోయిందని పేద, మధ్యతరగతి, కూలినాలీ చేసి జీవనం గడుపుతున్నవారు చెబుతున్నారు. నూకల ధరను కూడా విపరీతంగా పెంచడంతో వాటిని కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రస్తుతం పెల్లిళ్ల సీజన్ కావడంతో వ్యాపారులు ఇదే అదనుగా 5శాతం జీఎస్టీకితోడు మరికొంత మొత్తాన్ని కలిపి బియ్యం బస్తా ధరను పెంచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర రూ.1000కి పైగా పెరిగిందని, బియ్యంకుతోడు ప్యాకింగ్‌తో కూడిన కందిపప్పు, పెసరపప్పు, పొట్టు మిన పప్పు, జిలకర్ర, ఆవాలు వంటి పదార్థాలపై జీఎస్టీ విధించడంతో నెలసరి సరుకులు కొనడం కష్టసాధ్యంగా మారిందని చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోయాయని, గత ఏడాది సోనా మసూరి క్వింటాల్ బస్తా బియ్యం ధర రూ.3700 ఉండేదని, ప్రస్తుతం ఈ ధర రూ.4500కు చేరిందని సూపర్ మార్కెట్లలో మరో రూ.200 నుంచి రూ.300 అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎంటీ, మిర్యాలగూడ రైస్, కర్నూలు రైస్ ఇలా బ్రాండ్లను బట్టి వంద కిలోల బస్తా ధర ఏకంగా రూ.5వేలకు అమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కర్నూలు సోనా మసూరి రూ.3300 ఉండేదని ప్రస్తుతం ఈ ధర రూ.4400కు చేరిందని చెబుతున్నారు. గత ఏడాది బాస్మతి రైస్ బియ్యం క్వింటాల్‌కు రూ. 12000 నుంచి రూ.14000 వరకు రకాన్ని బట్టి విక్రయించేవారని , ప్రస్తుతం ఈ ధర రూ.17వేలకు పైమాటగానే ఉందని చెబుతున్నారు.
బాస్మతి బియ్యం ధర పెరిగిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌ల్లో బిర్యానీ ధరను పెంచేందుకు వ్యాపారులు, నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారని, ప్రస్తుతం సింగిల్ బిర్యానీ ధర రూ.150 ఉండగా… ఆ ధరను రూ.180 నుంచి రూ.200కు పెంచేందుకు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది. ఒకవైపు మటన్, చికెన్ ధరలు పెరగడం, మరోవైపు బాస్మతి ధర కూడా కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీతో పెరగడంతో అన్ని రకాల ఆహార పదార్థాల ధరలను పెంచేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు సిద్దమయ్యాయని చెబుతున్నారు. గత ఏడాది నూకలు నాసిరకం బియ్యం ధర రూ.3వేలు పలికితే ప్రస్తుతం ఈ ధర రూ.4వేలకు చేరిందని వ్యాపారులు అంటున్నారు. బియ్యం, నూకలు కొనేందుకు తన దగ్గరకు వస్తున్న వినియోగదారులు ధరలను చూసి దిగాలు పడుతున్నారని, గతంలో ప్రతినెలా 50 కిలోల బియ్యాన్ని కొనే వినియోగదారుడు ప్రస్తుతం ధర తక్కువ ఉన్న బియ్యాన్ని తీసుకొని వెళుతున్నాడని , పెరిగిన ధరలతో తమ వ్యాపారం కూడా తగ్గిపోయిందని , ప్రత్యామ్న్యాయ మార్గాల వైపు తాము చూస్తున్నామని దుకాణాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనా మసూరిలో మూడు రకాలు ఉంటాయని, ఈ మూడు రకాల ధరలు 25 కిలోల బస్తాకు రూ.200 నుంచి రూ.400 వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్ ధరలే ఇలా ఉంటే… రిటైల్ వ్యాపారం చేసే వారు మరో 50 రూపాయలు రవాణా ఛార్జీల కింద వసూలు చేస్తున్నారని, దీంతో బియ్యం ధరలు తడిసి మోపెడవుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ పేరుతో 25 కిలోల బియ్యం బస్తా ధరను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో జీవనంసాగించడం కష్టసాధ్యంగా మారిందని అంటున్నారు. రాబోయే రోజుల్లో గంజి నీళ్లు తాగే పరిస్థితి వస్తుందన్న ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు.
ఉత్పత్తి పెరిగినా ధరలు పైపైకి…
తెలంగాణ రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగి ధాన్యం పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో సన్న బియ్యం ధరలను పెంచకతప్పదన్న పరిస్థితి ఏర్పడిందని రైస్ మిల్లర్లు వాపోతున్నారు. 25కిలోల వరకు ప్యాకింగ్ వస్తువులపై 5శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం విధించడంతో బియ్యంతోపాటు ఇతర ప్యాకింగ్ ఆహార పదర్థాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదని, ప్యాకింగ్ లేని వాటిని మాత్రమే తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని రిటైల్ షాపు యజమానులు చెబుతున్నారు. గతంలో పప్పులతోపాటు జిలకర్ర, ఆవాలు, మెంతులు వంటివి ప్యాకింగ్ ఉంటేనే తీసుకునేవారని, జీఎస్టీ దెబ్బకు వినియోగదారులు ప్యాకింగ్ లేని లూజుగా ఇవ్వాలని కోరుతున్నారని వారంటున్నారు. తామూ కూడా చేసేదేమి లేక హోల్‌సేల్ డీలర్ల నుంచి బస్తాల్లో వీటిని తీసుకొచ్చి విక్రయిస్తున్నామని చెప్పారు. గతంలో బస్తాల్లో ఉన్న పప్పులు, జీలకర్ర, ఆవాలు వంటి వాటిని తీసుకొచ్చి 50 గ్రా, 100 గ్రా, 200 గ్రా, పావు కిలో, అరకిలో, కిలోలాగా ప్యాకింగ్ చేసే విక్రయించే వారమని, ప్రస్తుతం అలా చేయడం లేదని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.