Friday, November 22, 2024

మాఘమాసం రాకతో పెరుగుతున్న పెళ్లిళ్ల సందడి.. పుణ్య క్షేత్రాల్లో పెరిగిన రద్దీ

అమరావతి, ఆంధ్రప్రభ : మాఘమాసం రాకతో రాష్ట్రంలో పెళ్లి సందడి ఆరంభమైంది. ఈ నెల 28 నుంచి మార్చి 17వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేలాదిగా వివాహాలు, గృహ ప్రవేశాలు, భూమిపూజ, నిశ్చయ తాంబులాలు వంటి శుభకార్యాలు జరగనున్నాయి. నెలన్నర రోజుల పాటు ఎటు చూసినా సందడే సందడి. అసలు పెళ్లంటే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే కల్యాణ మండలాలు మొదలు పురోహితులు, వంటల తయారీదారులు, షామియానా సమకూర్చేవారు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, లైటింగ్‌, పూల అలంకరణ చేసేవారు, మంగళవాయిద్యాలు, దర్జీలు, ఆభరణాల తయారీదారులు, ఐస్‌క్రీం పార్లర్లు, కూరగాయలు సరఫరాదారులకు డిమాండ్‌ పెరిగింది. అన్ని వ్యాపార సంస్థలు కళ కళ లాడుతున్నాయి.

- Advertisement -

గతంలో పోలిస్తే అన్ని ధరలూ పెరిగిపోవడంతో బడ్జెట్‌ 30 నుంచి 50 శాతం వరకు పెరగనుంది. కార్తీక మాసం అనంతరం రెండు నెలల పాటు శుభముహుర్తాలకు విరామం వచ్చింది. గతేడాది డిసెంబరు 2 నుంచి 18వ తేదీ వరకు పరిమిత ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు తక్కువగానే జరిగాయి. డిసెంబరు 24 నుంచి ఇప్పటివరకు ఎక్కడా కార్యక్రమాలు జరగలేదు. ఈ నెల 28వ తేదీతో పాటు ఫిబ్రవరి 1, 8, 9, 10, 11, 12, 15, 16 23, 24 తేదీల్లో, మార్చి 1, 5, 8, 9, 10, 11, 13, 15, 17 తేదీల్లో ముహూర్తాలు ఉండడంతో జనం శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 29 వరకు గురుమౌఢ్యమి ఉన్న కారణంగా ఈ కాలంలో ఎవరూ శుభకార్యాలు చేయరు.

మంచి ముహూర్తాలే..

మాఘమాసం నేపథ్యంలో ఈ నెల 28 నుంచి మార్చి 17వ తేదీ వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆయా తేదీల్లో వివాహాలు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 29 వరకు గురుమౌఢ్యమి ఉన్న కారణంగా శుభకార్యాలు చేయరాదని పండితులు చెబతున్నారు.

పుణ్య క్షేత్రాల్లో పెరిగిన రద్దీ..

వివాహాలకు శుభ ముహూర్తాలు రావడంతో తిరుపతి, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, సింహాచలం తదితర పుణ్య క్షేత్రాల్లో రద్దీ పెరిగింది. నిత్యం వందలాది జంటలు ఈ క్షేత్రాల్లో ఏకం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement