విప్రో కన్జ్యూమర్ కేర్ సంప్రదాయ ఆహారబ్రాండ్ల మార్కెట్లో విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. కేరళకు చెందిన నిరపరా సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, మసాలాల రంగంలోకి విప్రో ప్రవేశించినట్లైంది. ఒప్పందం విలువ ఎంత అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇది తమకు 13వ కొనుగోలు అని, దీంతో మసాలాలు, రెడీ టు కుక్ విభాగంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అయిందని విప్రో కన్జ్యూమర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ చుగ్ తెలిపారు.
భారత్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్లలో విప్రో కన్జ్యూమర్ కూడా ఒకటి. 2021-22లో ఈ కంపెనీ రూ.8630 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. హోంకేర్, విద్యుత్ వైర్లు, పరికరాలు, శుభ్రత ఉత్పత్తులు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు, గృహ, వాణిజ్య లైటింగ్, సీటింగ్ ఉత్పత్తులు అందిస్తోంది.
ఇప్పటికే మసాలాల రంగంలో ఉన్న ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలైన డాబర్, ఇమామీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఐటీసీ సరసన తాజా కొనుగోలుతో విప్రో కన్జ్యూమర్ కూడా చేరింది. నిరపరాను 1976లో స్థాపించారు. ఈ బ్రాండ్ అనేక రకాల మసాలా మిశ్రమాలను అప్పం, ఇడియప్పం మొదలైన వాటి తయారీలో ఉపయోగించే బియ్యం పిండిని ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం కంపెనీ వ్యాపారంలో 63 శాతం కేరళలోనే జరుగుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాల వాటా కేవలం ఎనిమిది శాతం మాత్రమే. మిగిలిన 29శాతం వ్యాపారం గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి వస్తోంది.