టెక్సాస్-ఫ్లోరిడా, నార్త్‌కరోలినాలో తుపాను
గడ్డకట్టుకుపోయిన పలు నగరాలు
వణికిస్తున్న చలి గాలులు
పలు విమానాలు రద్దు..
స్కూళ్లకు సెలవులిచ్చిన ప్రభుత్వం
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :
దక్షిణ అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ నుంచి ఫ్లోరిడా, నార్త్ కరోలినా వరకు మంచు తుపాను విస్తరిస్తోంది. ఈ రోజు కూడా మంచుతుపాను ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. అమెరికాలో రికార్డుస్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా న్యూఓర్లీన్స్, అట్లాంటా, జాక్సన్‌విల్లే నగరాలు గడ్డకట్టుకుపోయాయి.
వణికిస్తున్న చలి గాలులు
మంచుకు తోడు చలిగాలులు కూడా ప్రజలను వణికిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి మధ్య పశ్చిమ, తూర్పు అమెరికా ప్రాంతాల మీదుగా వీస్తున్న గాలి వాతావరణం గడ్డకట్టదానికి కారణమవుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. ఫలితంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. న్యూఓర్లీన్స్‌లో రికార్డుస్థాయిలో 10 అంగుళాల (25 సెంటీమీటర్లు) మేర మంచు కురిసింది. జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రకారం అలస్కాలో డిసెంబరు నుంచి కురుస్తున్న హిమపాతాన్ని ఇది అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది..