అలా ప్రారంభం కాగానే.. ఇలా వాయిదా
అదానీ వ్యవహారంపై చర్చజరపాల్సిందే
ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీల పట్టు
రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం?
తీర్మానంపై ప్రతిపక్ష ఎంపీల సంతకాలు
తగిన సమయం కేటాయిండం లేదని ఆరోపణలు
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న వాయిదా పడిన ఉభయ సభలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే.. సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 12వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు సమావేశాల ప్రాంభానికి ముందు కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంట్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో భేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం?
తమపై వివక్షా వైఖరిని ప్రదర్శిస్తున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన తీర్మానంపై 50 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేసినట్టు ఆ వర్గాలు సోమవారం తెలిపాయి. రాజ్యసభ నుంచి తాము తరచు వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్ ధన్‌ఖడ్ వైఖరే కారణమని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు చైర్మన్ తగినంత సమయాన్ని కేటాయించడం లేదని వారు భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.