ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ:మహారాష్ట్రాలో మహాయతి ప్రభజనం.. జార్ఖండ్‌లో విజయంతో ఇండియా కూటమి జోరుమీదున్నాయి. ఈ ఇరు కూటములూ పార్లమెంట్ వేదికగా తమ సత్తా నిరూపించుకునేందుకు సన్నద్ధం అవుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరన్ రిజిజు ఈ సమావేశం నిర్వహించారు.
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, కిరెన్ రిజిజు, వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ నుంచి తెలుగుదేశం, జనసేన, బీఆర్ఎస్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు. అదానీ యవ్వారమే హాట్ హాట్..అఖిలపక్ష పార్టీ నేతల భేటీ సందర్భంగా కీలక బిల్లుల ఆమోదానికి సహకారం, రాజ్యాంగం ఏర్పడి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలపై చర్చించారు. ఇక.. అదానీ లంచాల వ్యవహారం, మణిపూర్ అల్లర్లు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, చైనా సరిహద్దు అంశం సహా ప్రజా సమస్యలపై చర్చించాలని అఖిలపక్షంలో విపక్షాలు డిమాండ్ చేశాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు 25వ తేదీ నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు జరుగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ‘ఒక దేశం -ఒకే ఎన్నిక’ జమిలి బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.
వీటిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు కిరెన్ రిజిజు తెలిపారు. సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
పార్లమెంట్ భేటీకి ఏపీ పార్టీలు రెడీ.
.ఇప్పటికే తాడేపల్లిలో అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. పార్లమెంటులో అనుసరించాల్సిన విధానాలపై చర్చ జరిగింది. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఇద్దరు ఎంపీలు బాలశౌరి, శ్రీనివాస్‌తో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చర్చించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఇక.. పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ వ్యూహం కూడా ఉండబోతోంది. పోలవరం ఎత్తును తగ్గించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిలదీస్తామని. వక్ఫ్ సవరణ బిల్లును ఒప్పుకోమని, ప్రత్యేక హోదా కోసం నినదిస్తామని, కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులను చర్చించాలని ఆ పార్టీ నేతలు తీర్మానం చేసుకున్నారు. ఈ స్థితిలో ఆదివారం జరిగిన అఖిలపక్షం భేటీలో టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.