పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 19 రోజుల పాటు కొనసాగే ఈ సెషన్ లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… ప్రజల తీర్పు తరువాత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. మరోసారి ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ లో ఫలవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
శీతాకాలం ఆసల్యమైనా.. దేశంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు ఆయన అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల పక్షాన ఉన్న వారికి అనూహ్యమైన మద్దతు లభిస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలన్న తపన ఉంటే, అప్పుడు ప్రజా వ్యతిరేకత ఉండదని మోదీ అన్నారు. దేశంలో ఇప్పుడు ప్రభుత్వ అనుకూలత, సుపరిపాలన, పారదర్శకత ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ద్వేషభావాన్ని దేశం తిరస్కరించిందన్నారు. ప్రజల ఆశయాలను బలోపేతం చేయడానికి ప్రజాస్వామ్య ఆలయమే కీలకం అన్నారు.