విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపు
శీతాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంతో ప్రధాని ప్రసంగం
పిడికెడు సభ్యుల అలజడితోనే సమస్యలు
స్వార్థ ప్రయోజనాలు వీడనాడాలని హితవు
న్యూ ఢిల్లీ – పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్ష పార్టీలు, ఉభయ సభల సభ్యులు సరైన చర్చ జరిగే విధంగా సహాకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భారత రాజ్యంగం అమల్లోకి వచ్చి రేపటితో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన పార్లమెంట్ భవన్ ముందు సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై నేడు మాట్లాడారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని ప్రధాని గుర్తు చేసారు. పార్లమెంటులో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. సమావేశాల్లో సాను కూల చర్చలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. పార్లమెంటులో వీలైనంత ఎక్కువమంది సభ్యులు చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభలో అర్ధవం తమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.
విపక్ష పార్టీలు ప్రజల ఆకాంక్షకు అనుగూణంగా నడుచుకోవడం లేదని అందుకే పదే పదే తిరస్కరించబడుతున్నారని విమర్శించారు. పిడికెడు మంది సభ్యులు చర్చ జరగకుండా సభలో అడ్డుకుంటున్నారని..అలాంటి సంస్కృతి మారాలన్నారు. సభలో సరైన చర్చ జరగాలని సభ్యులను ప్రధాని వేడుకున్నారు.మన పార్లమెంట్ నుంచి ప్రజలకు సరైన సందేశం వెళ్లాలని కోరారు. అన్నీ పార్టీల్లోనూ కొత్త సభ్యులు ఉన్నారని..వారికి సభలో మాట్లాడే అవకాశం రావాలని మోదీ కోరారు.