న్యూ ఢిల్లీ – వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఈ ఎన్నికల ముసాయిదా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే ముసాయిదా బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభలో ప్రవేశ పెట్టబోతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో దీన్ని సభలో టేబుల్ చేయడానికి లైన్ క్లియర్ అయింది. ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
దీనిపై ప్రత్యేకంగా అధికార, ప్రతిపక్ష సభ్యులతో కూడిన ఓ జేపీసీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ కమిటీ ఇచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలులోకి 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా ఈ పరిస్థితుల మధ్య అటు ఎన్డీఏ, ఇటు ఇండియా బ్లాక్.. మూడంచెల విప్‌ను జారీ చేశాయి. నేడు, రేపు ఈ విప్ అమలులో ఉంటుంది. ఈ రెండు రోజుల పాటు ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించాయి. రాజ్యాంగంపై చర్చ చేపట్టడమే దీనికి ప్రధాన కారణం. సభ ఆరంభమైన వెంటనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగంపై చర్చను ఆరంభించే అవకాశం ఉంది. రేపు కూడా ఇది కొనసాగుతుంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో దీనిపై చర్చ మొదలు పెడతారు. ఉభయ సభల్లో ఏకకాలంలో చర్చ కొనసాగే అవకాశం ఉంది.