హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా భారాస ముందుకు వెళ్తోంది. గెలుపు వ్యూహంతో పార్టీని ప్రజల్లో ఉంచుతోంది. నిత్యం జనం చెంతకు కార్యక్రమాలను తీసుకువెళ్లేలా ప్లాన్ చేసింది. నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు గత రెండు నెలలుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ జనం చెంత ఉంటున్నారు. వారితో సమాంతరంగా ఆశావహులు సైతం పార్టీ ప్రచారాన్ని చేస్తున్నారు. టికెట్ తమకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో తమకు అవకాశాలున్నాయని తెలుపుతున్నారు. అధిష్టానం సైతం వారికి తమ తమ నియోజకవర్గాల్లో పనులు చేసుకోవాలని సూచించింది. పలువురు నేతలు అధినేత ఆశిస్సులతోనే తాము రంగంలోకి దిగినట్లు చెప్పుకుంటున్నారు. ఆ ఉత్సాహంతోనే ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ హవాను చాటుతున్నారు. గెలుపు సులువుగా మారుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. సిట్టింగ్‌ను మార్చితే తమకే అవకాశం దక్కుతుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
అధినేత ఆచి తూచి..
తెలంగాణలో వార్ వన్ సైడ్ కావాలని భారాస అధినేత భావిస్తున్నారు. ఇందు కోసం పార్టీలోని ప్రధాన లీడర్లను, బలమైన వర్గాలకు సంబంధించిన నేతలను ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఎవరూ ప్రచారాన్ని నిర్వహించినా పార్టీకి ఉపయోగపడేలా చూస్తున్నారు. ప్రజల్లో పార్టీ ఉండాలన్నదే అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. వ్యతిరేకత ఉంటే పొగొట్టుకోవాలి. సానుకూలంగా మార్చుకోవాలి. అంతే కానీ పార్టీ ఓటు బ్యాంకు చీలకూడదు.. చీల్చకూడదన్నదే ప్రధాన ఉద్ధేశ్యంగా స్పష్టం అవుతోంది.
అందులో భాగంగానే సిట్టింగులు చొచ్చుకొని వెళ్లలేకపోతున్న చోట్ల, పార్టీ బలం ఇంకా పెంచాల్సిన ప్రాంతాల్లో మరో నేతకు సైతం అవకాశం కల్పిస్తున్నారు. సిట్టింగ్, ఆశావహుల్లో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటే వారికే టికెట్ దక్కుతుందని గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టికెట్ విషయం అధినేతకు వదిలేసి పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్లే బాధ్యతను మాత్రం నిర్వహించాలని అధిష్టానం నుంచి సూచనలు సైతం వెళ్లాయి. సిట్టింగ్‌లతో సమాంతరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆశావహులు సైతం ఎక్కడా పార్టీ లైన్ దాటి వెళ్లడం లేదు. పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం లేదు. పార్టీ కోసం, గెలుపు కోసం మాత్రమే పని చేస్తున్నారన్న చర్చ ఇప్పుడు గులాబీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కొంత మందికి అధినేత నుంచి ఆదేశాలు రావడంతోనే నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సర్వేలు, ఓటు బ్యాంకు..
రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలపై అధిష్టానం దృష్టి సారించినట్లుగా గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వేల్లో వెనుకబడిన వారు, సిట్టింగ్‌లు ఇంకా జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. సీనియర్ నేతలు అవకాశం కోరుతున్న ప్రాంతాల్లో ఎలా సర్థుబాటు చేయాలని కూడా చూస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో సిట్టింగ్‌తో సమాంతరంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అధిష్టానంతో సత్సంబంధాలు ఉండటం కలిసి వచ్చే అవకాశం. ఎల్బీనగర్‌లో సిట్టింగ్‌తో సమాంతరంగా మరో నేత రామ్మోహన్ గౌడ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో తనకే టికెట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు. తుంగతుర్తిలో మేడే రాజీవ్ సాగర్, మందుల సామెల్ టికెట్‌ను ఆశిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శేరిలింగంపల్లిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ టికెట్‌ను ఆశిస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
అధినేత ఆశిస్సులు తమకే ఉన్నాయంటూ తెలుపుతున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సమాంతరంగా నీలం మధు ప్రచారం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్, హరీష్ రావు ఆశిస్సులతో దూసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ దక్కుతుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాబలం తనకే ఉందని నిరూపించుకుంటున్నారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటా పోటీగా ప్రోగ్రామ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా కరీంనగర్‌లో మూడు చోట్ల, మహబూబ్‌నగర్‌లో రెండు చోట్ల, నల్గొండలో మరో రెండు స్థానాల్లో, వరంగల్‌లో నాలుగు స్థానాల్లో, మెదక్‌లో మరో రెండు చోట్ల ఆశావాహులు దూసుకువెళ్తున్నారు. అధిష్టానం సైతం వారిని ప్రోత్సహిస్తోంది. జనంలో ప్రజా బలం ఉన్న లీడర్లను వదులుకునేందుకు సిద్ధంగా లేదని గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంతిమంగా పార్టీ బలం, ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా అధినేత ముందుకు వెళ్తున్నారు.