Friday, November 22, 2024

Winning Formula – కాంగ్రెస్ ప‌వ‌ర్ వ్యూహం “పంచ‌తంత్రం”….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కర్ణాటక విజయంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాలో పాగా వేసేందుకు భారీ ఎత్తున వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ నేతల నడుమ సమన్వయం కుదిర్చేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ పెద్దలు పనిలో నిమగ్నమయ్యారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ నాయకులు విభేదాలను విడనాడి సమన్వయం కుదుర్చుకుని ముందుకు వెళితే 75 సీట్లుకు మించి అసెంబ్లి స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని శక్తిగా ఎదగవచ్చన్న భావనతో పార్టీకి చెందిన ఢిల్లి పెద్దలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూ హకర్త సునీల్‌ కనుగోలు బృందం నిరంతరం నిర్వ హస్తున్న సర్వేలలో ఊ హంచని ఫలితాలు వస్తున్నట్టు పార్టీ కీలక నేతలు చెబుతున్నారు భారాస ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిన విషయాన్ని ప్రజలే నేరుగా చెబుతున్న విషయం సర్వేలలో బయట పడిందని సునీల్‌ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యనేతలు కలిసి సమిష్టిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే తిరుగులేని విజయం నమోదు చేయవచ్చని సునీల్‌ కనుగోలు స్పష్టం చేసినట్టు కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు. నాయకుల నడుమ సమన్వయం కలిసికట్టుగా పనిచేసేందుకు తీసుకోవలసిన చర్యలపై పార్టీ కీలక నేతలు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

పార్టీ బలోపేతానికి ఐదు ఫార్ములాలను కాంగ్రెస్‌ అధినాయకత్వం సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. అసెంబ్లి ఎన్నికల్లో ఎటువంటి వ్యూ#హంతో ముందుకెళ్లాలన్న అంశాన్ని చర్చించి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఈ నెల 12న ఢిల్లి లో అత్యంత కీలక భేటీ జరగనుంది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేతలు రా హుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రే, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఏఐసీసీ నేతలు సంపత్‌ కుమార్‌, వంశీచంద్‌ రెడ్డితో పాటు పార్టీకి చెందిన కీలక నేతలకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్టు సమాచారం.

ఐదు ఫార్ములాలను రాష్ట్ర నాయకుల ముందుంచి ఢిల్లి పెద్దలు చర్చించనున్నట్టు చెబుతున్నారు. ఫార్ములాలలో మొదటిది అతి ముఖ్యమైనదిగా భావిస్తున్నది సీనియర్ల నడుమ సమన్వయం. పార్టీలో జూనియర్లు సీనియర్లన్న తరతమ బేధాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు అధినాయకత్వం ఉద్భోదించనుంది. ఈ విషయంలో కఠినంగా ఉంటామన్న సంకేతాలను ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పెద్దలు సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం. ఈ ఫార్ములా సక్సెస్‌ అయితే తెలంగాణాలో కాంగ్రెస్‌కు తిరుగుండదన్న భావన పార్టీ పెద్దల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు తాజా ఉదా హరణ కర్ణాటక అసెంబ్లి ఎన్నికల ఫలితాలేనని చెబుతున్నారు. కర్ణాటకలో భాజపా, జేడీఎస్‌ను కోలుకోలేని దెబ్బ తీశామని తెలంగాణలోనూ కలిసికట్టుగా పనిచేస్తే భారాస నామరూపాలు లేకుండా చేయవచ్చని పార్టీ ముఖ్యులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు.

రెండో ఫార్ములా ఆపరేషన్‌ ఆకర్ష్‌
కాంగ్రెస్ హైహకమాండ్‌ రూపొందించిన రెండో ఫార్ములా ఆపరేషన్‌ ఆకర్ష్‌. వివిధ కారణాల చేత విపక్ష పార్టీలలో ఇమడ లేకపోతున్న నేతలను అక్కున చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. భారాస అధినాయకత్వం పట్టించుకోని నేతలను గుర్తించి గాలం వేయాలని కూడా పీసీసీకి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం. వివిధ సమస్యలు, కారణాలతో కాంగ్రెస్‌ను వీడిన వారికి సైతం స్వాగతం పలకాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. మొత్తం మీద వచ్చే రెండు మూడు నెలలు చేరికలపైనే దృష్టి సారించేందుకు వ్యూ హం రచిస్తోంది.

- Advertisement -

ఫార్ములా-3 సీనియర్ల ఘర్‌ వాపసీ
ఈ పదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీని వీడి ఆయా పార్టీల్లో చేరిన సీనియర్లను తిరిగి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. సీనియర్లతో సంప్రదించి వారితో సమన్వయం చేసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వారితో సంప్రదింపులు జరిపేలా ప్రణాళిక రూపొందించే పనిలో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. భారాసలో అసంతృప్త నేతలను ఆకర్షించాలని ప్రతిపాదించారు.

ఫార్ములా-4 చిన్న పార్టీలు ప్రజా సంఘాలతో దోస్తీ
భారాస, భాజపాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ విధానాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై నిరంతరం పోరాడుతున్న పార్టీలను ప్రజా సంఘాలను ఏకం చేసి వారితో దోస్తీ కట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటువంటి పరిస్థితుల్లో చీలకుండా ఉండేందుకు చిన్న పార్టీలు ప్రజా సంఘాలను పార్టీ వైపు తిప్పుకోవాలన్న నిర్ణయానికి కాంగ్రెస్‌ పార్టీ వచ్చినట్టు సమాచారం. తెలంగాణ సాధన కోసం ఎన్నో పార్టీలు సంఘాలు పోరాడాయని కానీ సీఎం కేసీఆర్‌ వాటిని తొక్కి పడేయడంతో పాటు ఎదురు తిరిగిన వారిపై కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని అటువంటి పార్టీలు ప్రజా సంఘాలను చైతన్య పరిచి కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఫార్ములా-5 హామీలు మేనిఫెస్టోలతో ఆకర్షణ
అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కర్ణాటకలో ఐదు కీలక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరహాలోనే తెలంగాణలోనూ హామీలు అందుకు తగిన ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి, విద్యా సంస్థల ఏర్పాటు, రైతు రుణ మాఫీ, రైతులకు ఉచితంగా ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు మహళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మ హళా రిజర్వేషన్లు వంటి హామీలపై కసరత్తు చేసి వాటిని ఎన్నికల ప్రణాళికలో పెట్టె అంశంలో ఖచ్చితమైన వ్యూ హం రూపొందించాలని భావిస్తోంది. భారాస మోసపూరిత హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలను కూడా రూపొందించాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం మేధోమధనం చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement