Tuesday, November 26, 2024

బియ్యం ధరలకు రెక్కలు.. బస్తాపై గరిష్టంగా రూ.500 వరకు పెరుగుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అంచనాకు మించి ధాన్యం పండినా.. అవసరానికి పదింతల బియ్యం ఉత్పత్తి జరిగినా.. ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపెట్టుకుని ఉన్న బియ్యం లావాదేవీల్లో తలెత్తుతున్న సమన్వలోపం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఎఫ్‌సీఐ ద్వారా సేకరించిన బియ్యాన్ని కేంద్రం రాష్ట్రాల అవసరాల మేరకు విడుదల చేస్తుంటుంది. ఇటీవల కాలంలో ఉత్పత్తిలో సగానికి పైగా బియ్యాన్ని కేంద్ర విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫలితంగా ధరాఘాతం పేద, మధ్యతరగతి వర్గాలను వెంటాడుతోంది.

బహిరంగ మార్కెట్లో కొరత ఏర్పడుతున్న కారణంగా వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారు. ప్రజలకు జీవనాధారమైన నిత్యావసర సరుకుల్లో అతి కీలకమైన బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. రోజుల వ్యవధిలోనే వందల రూపాయల ధర పెరుగుతూ ఉండడంతో నిరుపేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే, నెల రోజుల వ్యవధిలో క్వింటాలు బియ్యం బస్తా ధర రూ.400 నుంచి రూ.500కు పెరిగిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నిత్యావసర సరుకులతో పాటు పప్పు దినుసులు, కూరగాయల ధరల్లో అనూహ్య పెరుగుదల సామాన్యుల కుటుంబాలను కుదేలయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధరలు పెరగుతుండడంతో హోల్‌సేల్‌ వ్యాపారులు సరుకు దిగుమతులను కూడా నిలిపివేశారు.

- Advertisement -

సోనా మసూరి రకం 26 కిలోల బస్తా మొన్నటివరకు రూ.1,040 ఉండేది. ఇప్పుడు ఆ ధర మిల్లర్ల దగ్గరే రూ.1,140కు చేరింది. ఇక రి-టైల్‌గా వ్యాపారులు రూ.25 నుంచి రూ.50 వరకు అదనంగా పెంచి విక్రయిస్తుంటారు. హెచ్‌ఎంటీ రకం సన్నబియ్యం 26 కిలోల బస్తా రూ.1,250 ఉండెగా, ఇప్పుడు ఆ ధర రూ.1350కు పెరిగింది. నాన్‌-బీపీటీ స్టీమ్‌ రైస్‌ (666 గ్రీన్‌ రకం) క్వింటాలు ధర రూ.4,500, సోనా 666 పింక్‌ ధర రూ.4,900, సోనా 666 బ్లూ ధర రూ.4,900, ఆర్‌ఎన్‌ఆర్‌ 666 గ్రీన్‌ రూ.5,100, హెచ్‌ఎంటీ 666 బ్లూ ధర రూ.5,300, జేఎస్‌ఆర్‌ కుబేరా పింక్‌క్లాత్‌ ధర రూ.5,600, బిహార్‌ హెచ్‌ఎంటీ రెడ్‌క్లాత్‌ ధర రూ.5,600, రా-హెచ్‌ఎంటీ కుబేరా రకం ధర రూ.5,900, దంపుడు బియ్యం ధర రూ.5,600లకు పెరిగినట్లు మార్కెట్‌ ధరలను బట్టి తెలుస్తోంది.

ఈ ధరల పెరుగుదలకు మరో కారణం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైసు మిల్లర్లంతా సిండికేట్‌గా మారి ధరలు పెంచేస్తున్నారని వ్యాపారులు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విదేశాలకు బియ్యం ఎగుమతిపై నిషేధం విధించే అంశాన్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. ఎల్‌నినో వాతావరణం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ధరలు భగ్గుమంటు-న్నాయి. ఈ క్రమంలో అన్ని వెరైటీల బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశీయంగా బియ్యం ధరలతోపాటు ద్రవ్యోల్బణం మరింత పైపైకి దూసుకెళ్లకుండా నివారించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం ప్రతిపాదన అమల్లోకి వస్తే 80 శాతం బియ్యం ఎగుమతులు నిలిచిపోనున్నాయి. అదే జరిగితే త్వరలోనే బియ్యం ధరలు అదుపులోకి రానున్నాయి.

ఆసియా దేశాల్లో 90 శాతం ఉప్పుడు బియ్యమే..

ప్రపంచ జనాభా సగం ఉప్పుడు బియ్యం వాడుతున్నారు. గ్లోబల్‌ సరఫరాలో ఆసియా దేశాల్లో 90 శాతం బియ్యం వినియోగిస్తారు. మరోవైపు ఎల్‌నినోతో పంటలు దెబ్బతినడం వల్ల బియ్యం ధరలు ఇప్పటికే రెండేండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్త బియ్యం వ్యాపారంలో భారత్‌ వాటా సుమారు 40 శాతం. కొన్ని రకాల వెరైటీ- బియ్యం ఎగుమతిపై నిషేధం విధించవచ్చు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో గతేడాది బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. గోధుమలు, బ్రౌన్‌ రైస్‌ దిగుమతులపై 20 శాతం ఎకై-్సజ్‌ డ్యూటీ విధించింది.

గోధుమలు, పంచదార ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. విదేశాలకు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించే విషయమై స్పందించేందుకు ఆహార, వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వశాఖల ప్రతినిధులు ముందుకు రాలేదు. బెనిన్‌, చైనా, సెనెగల్‌ సహా 100కి పైగా దేశాలకు భారత్‌ బియ్యం సరఫరా చేస్తున్నది. బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇండియన్‌ రైస్‌ మిల్లర్ల షేర్లు పతనయ్యాయి. దేశంలోనే అతిపెద్ద రైస్‌ కంపెనీ చమల్‌లాల్‌ సెతియా ఎక్స్‌పోర్ట్స్‌ 1.4 శాతం, కోహినూర్‌ ఫుడ్స్‌ 2.9 శాతం, ఎల్‌టీ ఫుడ్స్‌ 4.4 శాతం నష్టపోయినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడిస్తునాయి.

అన్ని రకాల నిత్యావసర ధరలకు రెక్కలు

ఒక్క బియ్యం ధరలే కాదు.. అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చాయి. ఆ ప్రభావం పేద, మధ్య తరగతి జీవులపై తీవ్రంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడటం, డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కందిపప్పు, గోధుమలు, బియ్యం, టమాటలతో పాటు పాలు, పాల ఉత్పత్తుల ధరలకు రెక్కలు వచ్చాయి. ధర ఎక్కువైనప్పటికీ ఈ సరుకులను కొనుగోలు చేద్దామంటే కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే వాస్తవాలను తోసిపుచ్చుతూ, నిత్యావసర వస్తువులకు కొరతేమీ లేదంటూ కేంద్ర మంత్రులు అబద్ధాలతో మభ్య పెట్టాలని ప్రయత్నిస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

అదుపు తప్పిన ధరలు.. ఏది ముట్టుకున్నా పిరమే…!

మొన్నటి వరకూ వంట నూనెల ధరలు సామాన్యులను బెంబేలెత్తించగా తాజాగా కందిపప్పు పెద్ద రందిగా మారింది. కిలో ధర రూ.150 వరకు చేరుకొన్నది. పిరం అయినప్పటికీ.. పప్పు కొనుగోలు చేద్దామని సూపర్‌ మార్కెట్లు-, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్లు, కిరాణా దుకాణాలకు వెళ్లిన కస్టమర్లకు నో స్టాక్‌, లిమి-టె-డ్‌ సేల్‌ బోర్డులే కనిపిస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతోనే కందిపప్పు కొరత ఏర్పడిందని వ్యాపారులు చెప్తున్నారు. ఇక మొన్నటి వరకూ కిలో రూ.30 పలికిన టమాటాలు ప్రస్తుతం రూ.150 దాటాయి. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడం తదితర కారణాల వల్ల ధరలు ఒక్క వారంలోనే అమాంతంగా పెరిగిపోయాయని వ్యాపారులు చెప్తున్నారు.

ఒకవైపు, కంది, టమాటా ధరలకు రెక్కలు రాగా.. గోధుమల నిల్వలపై ఇటీ-వల కేంద్ర ఆహార శాఖ పరిమితులు విధించింది. మరోవైపు ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీమ్‌(ఓఎంఎస్‌ఎస్‌) ద్వారా ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం కొనకుండా షరతు విధించింది. రానున్న రోజుల్లో గోధుమలు, బియ్యం కొరత ఏర్పడనున్నదన్న సంకేతాలను ఈ నిర్ణయాలు సూచిస్తున్నట్టు- నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పులిమీద పుట్రలా పాల ఉత్పత్తుల కొరత కూడా క్రమంగా పెరుగుతుతోంది. అమూల్‌, మదర్‌ డెయిరీ తదితర పాల ఉత్పత్తి కంపెనీల ఏకపక్ష నిర్ణయాలు, రైతులకు చెల్లింపుల్లో కోత, ప్రభుత్వ అలసత్వం వెరసి ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement