Tuesday, November 12, 2024

బియ్యం ధరలకు రెక్కలు.. హెచ్‌ఎంటీ, సోనా మసూరికి ఫుల్ డిమాండ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ అమెరికా తదితర విదేశాల్లోని తెలుగు వాళ్లనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులను సైతం సన్నబియ్యం ధరలు హడలెత్తిస్తున్నాయి. భారీగా పెరిగిన ధరలతో సన్న బియ్యం కొనాలంటేనే సామాన్యులు జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో పేద, సామాన్యులు మొదలుకొని సంపన్నులు కూడా సన్నబియ్యంతో వండి అన్నాన్నే తింటున్నారు. దీంతో ఇటీవలి కాలంలో అదేపనిగా పెరిగిపోతున్న సన్న బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గడిచిన నెలన్నర రోజుల్లోనే సన్నబియ్యం ధర క్వింటాకు రూ. 1000 నుంచి రూ.1500దాకా పెరిగిదంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో ఊహించుకోవచ్చు. రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండడంతో ఏం కొనాలో, ఎం తినాలో తెలియక సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

నెలన్నర క్రితం సోనా మసూరి, హెచ్‌ఎంటీ, బీపీటీ, జై శ్రీరాం తదితర రకాల కొత్త బియ్యం ధరలు క్వింటాకు రూ.5వేలదాకా ఉండేవి. కాని ఇప్పుడు క్వింటా సన్నబియ్యం ధర రూ.6500దాకా పెరిగింది. అంటే కొత్త (ఆ ఏడాది వచ్చిన ధాన్యం నుంచి వచ్చిన బియ్యం) సన్నబియ్యం ధరలు నెలన్నరరోజు ల వ్యవథిలోనే రూ.1000 నుంచి రూ.1500దాకా పెరిగాయి. ఇక ఏడాది క్రితం సన్న బియ్యం (పాతవి) ధరలు క్వింటాకు రూ.7వేల దాకా చేరాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సూపర్‌ మార్కెట్‌, బహిరంగ మార్కెట్లలో 25 కేజీల సోనా మసూరి బ్యాగ్‌ ను రూ.1500 నుంచి 1800 దాకా విక్రయిస్తున్నారు.

- Advertisement -

సన్నబియ్యం ధరలకు రెక్కలు రావడంతో ఇదే అదనుగా కొందరు ట్రేడర్లు, రైస్‌ మిల్లర్లు సన్న బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శలూ వినిపిస్తున్నాయి. కొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యాన్నే పదే పదే పాలిష్‌ కొట్టి సన్నబియ్యంగా విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా లభ్యమయ్యే సూర్యతేజ, జోకర్‌ పాత బియ్యాన్నే హెచ్‌ఎంటీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. తెలంగాణలో ఏటేటా సన్న వరి ధాన్యం సాగు క్రమేణా తగ్గటమే ధరల పెరుగదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుండడంతో రైతులు సన్న రకం ధాన్యం సాగును తగ్గించేశారు.

సాధారణంగా వానాకాలం వరిసాగు విస్తీర్ణంలో సన్న, డొడ్డు రకాల సాగు నిష్పత్తి 60:40గా ఉంటుంది. యాసంగి సీజనలో ఇది 40:60గా మారుతుంది. సన్నాలను ఖరీఫ్‌లో ఎక్కువగా, యాసంగిలో తక్కువగా రైతులు సాగు చేస్తుంటారు. యాసంగిలో బియ్యం పట్టిస్తే నూక ఎక్కువోస్తుందన్న కారణంతోనే సన్నాలను తక్కువగా సాగు చేస్తారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం దొడ్డురకం ధాన్యాన్నే ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేస్తుండడంతో సన్నాల సాగు తెలంగాణలో గణనీయంగా తగ్గిపోతోంది. మరోవైపు సన్నరకాలు శ్రీరామ్‌, హెచ్‌ఎంటీ, సోనా మసూరి, బీపీటీతో పోలిస్తే దొడ్డు రకాల ధాన్యం ఐఆర్‌ 64, ముల్కనూరు ఇతర రకాల ధాన్యం నుంచి దిగుబడి ఎక్కువగా వస్తోంది. మరోవైపు దొడ్డు ధాన్యానికి, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర విషయంలో పెద్దగా తేడా లేకపోవడంతో రైతులు సన్నరకం ధాన్యం సాగుకే మొగ్గు చూపుతున్నారు.

అదే సమయంలో దొడ్డురకం వరి పైరుతో పోల్చుకుంటే సన్నరకం వరి పైరుకు చీడపీడల బాధలు ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల మందులు పిచికారి చేయాల్సి ఉంటుంది. దీంతో రైతులు సన్నరకం ధాన్యాన్ని సాగు చేయడానికి మొగ్గు చూపడం లేదు. ఇటు ప్రభుత్వం కొనుగోలుచేయక, ప్రయివేటకు తీసుకెళ్తే వ్యాపారులు కూడా పెద్దగా ధర పెట్టకపోవడంతో సన్న రకం వరి ధాన్యం సాగు ఏటేటా తగ్గుతూ వస్తోంది. మరోవైపు గత వానాకాలం, యాసంగిలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భారీ, అకాల వర్షాలతోపాటు వివిధ రకాల తెగుళ్లు సన్నరకం వరిపై ముప్పెటదాడి చేశాయి. దీంతో దిగుబడి భారీగా తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఇలా పలుకారణాల ప్రభావంతో సన్నరకం సాగు, దిగుబడి తగ్గి ధరల పెరుగుదలకు కారణమవుతోందని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement