Wednesday, November 20, 2024

Delhi | మహిళా బిల్లుకు మోక్షం లభించేనా? రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఎంతో కాలంగా పెండింగులో ఉన్న మహిళా బిల్లు మరోసారి తెరపైకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో ఒకటైన ఈ బిల్లును పాస్ చేసి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోందన్న చర్చ జరగుతోంది. దేశ జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళా ఓటర్లను, మరీ ముఖ్యంగా ఓటు వేస్తున్నవారిలో అత్యధిక సంఖ్యలో ఉంటున్న మహిళలను ఆకట్టుకోడానికి బీజేపీ ఈ బిల్లును బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తుందన్న విశ్లేషణలు కూడా కనిపిస్తున్నాయి.

మరికొందరు మాత్రం ఇన్నాళ్లుగా మూలనపడేసిన ఈ బిల్లును ఇంత అత్యవసరంగా బూజు దులిపి పైకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటన్నది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడంతో అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు మహిళా బిల్లు పూర్వాపరాలను ఓసారి పరిశీలిద్దాం..

వాడుకలో మహిళా బిల్లుగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. సాంకేతికంగా రాజ్యాంగం (108వ సవరణ) బిల్లుగా వ్యవహరిస్తుంటాం. ఈ సవరణ ద్వారా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. రాజకీయాల్లో లింగ బేధం లేకుండా అసమానతలు తొలగించడం కోసం ఈ బిల్లు తీసుకురావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ, పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందలేకపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మిగిలిపోయింది తప్ప చట్టరూపాన్ని సంతరించుకోలేకోపోతోంది.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అయినా సరే ఇప్పటికీ వారి సంఖ్యతో పోల్చి చూస్తే తగినంత ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి. ఐక్యరాజ్య సమితి గణాంకాల (2022 సెప్టెంబర్) ప్రకారం 30 మంది మహిళలు 28 దేశాల్లో ప్రభుత్వాధినేతలుగా, కీలక ఉన్నత పదవుల్లో ఉన్నారు. తమ బాధ్యతల్లో సమర్థతను చాటుకుంటూ ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. మనదేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక మహిళ. ఇతర కీలక రాజ్యాంగ పదవుల్లో ఉన్న మహిళలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్లు ఆనంది బెన్ పటేల్, అనసూయ ఊకే, తమిళిసై సౌందర్ రాజన్ వంటి నలుగురైదుగురు తప్ప పెద్దగా ఎవరూ కనిపించరు.

2022 నాటి ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం 15 శాతం కంటే తక్కువగా ఉంది. 19 రాష్ట్రాల శాసనసభల్లో మహిళా శాసనసభ్యులు 10 శాతం లోపే ఉన్నారు. 10 శాతానికి పైగా మహిళా శాసనసభ్యులు ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (10.70 శాతం), ఛత్తీస్‌గఢ్ (14.44 శాతం), హర్యానా (10 శాతం), జార్ఖండ్ (12.35 శాతం), పంజాబ్ (11.11 శాతం), రాజస్థాన్ (12 శాతం), ఉత్తరాఖండ్ (11.43 శాతం), ఉత్తరప్రదేశ్ (11.66 శాతం), పశ్చిమ బెంగాల్ (13.70 శాతం), మరియు ఢిల్లీ (11.43 శాతం) ఉన్నాయి. లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం 14.94 శాతం కాగా, రాజ్యసభలో 14.05 శాతంగా ఉంది.

ప్రస్తుత లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యుల్లో 78 మంది మహిళా సభ్యులు ఉండగా, రాజ్యసభలో మొత్తం మొత్తం 224 మంది సభ్యులకు 32 మంది మహిళా సభ్యులున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్ట రూపం తెచ్చుకుని అమల్లోకి వస్తే.. లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 179కి చేరుతుంది. కొన్ని రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ దేశంలోని మొత్తం జనాభాలో మహిళలు సగటున 48.5% ఉన్నారు. 70 కోట్ల మహిళా జనాభాలో మహిళా ఎంపీల సంఖ్య ఉభయ సభల్లో కలిపి 110 మంది మాత్రమే ఉన్నారు. 1951లో దేశంలో సుమారు 17 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 94 కోట్లు దాటింది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 67.4 శాతం ఓటింగ్ నమోదైంది.

పోలైన ఓట్లలో అత్యధిక శాతం మహిళలే ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 7,334 మంది పురుషులు పోటీ చేయగా, 715 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం అభ్యర్థుల సంఖ్యతో పోల్చిచూస్తే మహిళా అభ్యర్థులు 9 శాతం మాత్రమే. గుడ్డిలో మెల్ల నయం అన్న చందంగా గతంతో పోల్చి చూస్తే ఈ 9 శాతం కూడా పురోగతిని సూచిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్‌లో పురుషులతో పోల్చితే మహిళా ఎంపీల నిష్పత్తి తక్కువగానే ఉంది. ఉక్క మహిళగా పేరొందని ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా సుదీర్ఘ కాలం పరిపాలించినప్పటికీ.. మహిళల ప్రాతనిధ్యంలో మాత్రం పెరుగుదల కనిపించలేదు.

ఈ పరిస్థితుల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తప్ప మహిళలకు కనీస ప్రాతినిధ్యం లభించే అవకాశం లేదని అర్థమవుతోంది. ఈ అవకాశాన్ని ఎవరు కల్పించినా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నవారవుతారు. రాజకీయంగా ఆ పార్టీకి కచ్చితంగా కలిసొచ్చే అంశంగా మారుతుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారం చేపట్టి, మూడోసారి మళ్లీ అధికారం సాధించే దిశలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న కమలనాధులు ఈ నిర్ణయం ద్వారా అత్యధిక ఓటుబ్యాంకును ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఓటర్ల జాబితాలో సగం వరకు మహిళలే ఉండడం ఒకెత్తయితే.. పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ మహిళలవేనని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఈ మహిళా బిల్లును అస్త్రంగా ప్రయోగించి లాభం పొందాలన్న కమలనాథుల ప్రయత్నాలు ఎంతమేర సఫలమవుతాయన్నది కాలమే సమాధానం చెబుతుంది. అసలు ఈ ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లును చర్చకు, ఓటింగుకు తీసుకొస్తారా అన్నది కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement