Saturday, November 23, 2024

ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లను నిషేధిస్తారా? ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లను నిషేధిస్తారా అంటూ బీజేపీ ఎంపీ (రాజ్యసభ) సీఎం రమేశ్ అన్నారు. రహదారులు, రోడ్లపై సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈమధ్య వచ్చిన వరదల్లో మానవ తప్పిదం కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని, ఆ కారణంగా వరదలను నిషేధించగలరా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ఇది కాదని, ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. జీవో రూపొందించినవారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 19ను ఒకసారి చదువుకోవాలని, భావప్రకటనా స్వేచ్ఛకు హరించాలని చూస్తే ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు.

ఈనెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారని, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రాజకీయ కార్యక్రమాలను అడ్డుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందని సీఎం రమేశ్ ఆరోపించారు. ప్రభుత్వం తీరు ఇలా ఉంటే తాము ఎవరి అనుమతులు తీసుకోకుండానే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఎలా జరిగాయో ఒకసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జరిగిన దుర్ఘటనలను ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలి తప్ప వాటిని సాకుగా చూపుతూ ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ ఘటనల వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని, నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్సీపీ తప్పిదాలపై బీజేపీ పోరాడుతుందని సీఎం రమేశ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథుల నుంచి మద్ధతు ఉందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, ప్రభుత్వాల మధ్య ఉన్న సహకారాన్ని పార్టీల మధ్య సహకారంగా చిత్రీకరించవద్దని చెప్పారు. రాజకీయంగా బీజేపీ ఎప్పుడూ వైఎస్సార్సీపీతో చెలిమి లేదని సీఎం రమేశ్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement