Saturday, November 23, 2024

ఫెడ్‌ ముంచుతుందా? లేపుతుందా, ఎఫ్‌ఐఐల అమ్మకాలు ఆగేనా?

స్టాక్‌ మార్కెట్‌ గత వారం దుమ్ములేపింది. గత 75 వారాల్లో అత్యధిక వీక్లీ లాభాల్ని నమోదు చేసింది. తిరుగులేని విధంగా పరుగులు తీసిన మార్కెట్‌ సోమవారం కూడా ఇదే ఉత్సాహం కొనసాగిస్తుందా అన్నదే మదుపరుల్ని పట్టి పీడిస్తున్న సమస్య. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ఇండస్ట్రీ హెవీ వెయిట్స్‌ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు తమ త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించాయి. వీటి ప్రభావం నేటి మార్కెట్‌పై తప్పక ఉంటుంది. ఇక మరో దిగ్గజం ఇన్ఫోసిస్‌ సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడించనుంది.

ఎఫ్‌ఐఐల వైఖరి
ఎఫ్‌ఐఐల వైఖరితో పాటు ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ నిర్ణయం, డాలర్‌తో రూపాయి మారకం, ముడి చమురు ధరలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి. గత వారం ఎఫ్‌ఐఐలు నెట్‌ బయ్యర్‌గా మారడం ఊరట కల్పించే అంశమే. అయితే, శుక్రవారం మాత్రం అమ్మకాలు జరిపాయి. అయితే, గత అక్టోబర్‌ నుంచి నిరంతరాయంగా అమ్మకాలు జరుపుతూ, పెట్టుబడులను అమెరికాకు తరలిస్తున్న ఎఫ్‌ఐఐల వైఖరిలో మార్పు కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.

ఫలితాల ప్రభావం
మార్కెట్‌ దిగ్గజాలు కొన్ని తమ ఫలితాలను శుక్రవారం వెల్లడించగా, మరికొన్ని హెవీ వెయిట్‌ కంపెనీలు ఈ వారం తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవి కూడా మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతాయి. యాక్సిక్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్ర, టాటా స్టీల్‌లు సోమవారమే తమ ఫలితాలను విడుదల చేయనుండగా, ఆ తర్వాతి రోజుల్లో బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌ అండ్‌ టి, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతి సుజుకి, టాటా మోటార్స్‌, నెస్లే, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, శ్రీసిమెంట్‌, ఎస్‌బీఐ లైఫ్‌ తదితర బడా సంస్థలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జులై నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులు కూడా ఈ వారం ముగుస్తాయి. ఇవన్నీ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయి.

ఫెడ్‌ రేట్లు
ఇక ఫెడ్‌ విషయానికి వస్తే ఈ నెల 26, 27 తేదీల్లో అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశం కానుంది. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయంపై మార్క్‌ట్లు స్పందిస్తాయి. బహుశా వడ్డీ రేట్లను పెంచరని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లను బట్టి మార్కెట్లు ముందుకు వెళ్లడమో లేక పడిపోవడమే జరుగుతుందని సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేవిధంగానే ఫెడ్‌ నిర్ణయం ఉంటుందని అయితే, లేబర్‌ మార్కెట్‌ను ఇది దెబ్బతీసేవిధంగా ఉండకపోవచ్చునని శామ్కో సెక్యూరిటీస్‌కు చెందిన అపూర్వ సేథ్‌ అంటున్నారు.

రూపాయి ప్రభావం
గత 11 వారాలుగా రోజురోజుకూ పడిపోతున్న రూపాయి విలువకు శుక్రవారం బ్రేక్‌ పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యంతో ఇది సాధ్యమైంది. డాలర్‌తో మారకం విలువ 80 రూపాయిలు దాటిపోగా, ఆర్బీఐ జోక్యంతో కొంచెం బలపడి 79.85 రూపాయిలుగా ఉంది. అయితే, ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయంపైనే రూపాయి మారకం విలువ కూడా ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. అప్పటివరకూ 79.75 నుంచి 80-20 మధ్య చలించవచ్చునని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన జతిన్‌ త్రివేది అంచనా వేస్తున్నారు. డాలర్‌ ఇండెక్స్‌ ప్రకారం రూపాయి పతనం ప్రస్తుతానికి ఇక్కడితే ఆగుతుందని జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌కు చెందిన చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ డాక్టర్‌ వీకే విజయకుమార్‌ చెప్పారు.

- Advertisement -

ఎఫ్‌ అండ్‌ ఓ ఎక్స్‌పైరీ
ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌ఐఐలు తమ పొజిషన్‌లను మార్చుకున్నారని, ఇది మార్కెట్‌లకు పాజిటివ్‌ సంకేతాలను ఇచ్చిందని లీడ్‌ రీసెర్చ్‌ కంపెనీ ఫైవ్‌ పైసా డాట్‌ కామ్‌కు చెందిన రుచిత్‌ జైన్‌ తెలిపారు. మార్కెట్‌ ఓవర్‌ బాట్‌ పొజిషన్‌కు చేరుకుందని సూచీలు చెబుతున్నాయని, దీంతో లాభాల స్వీకరణ జరగవచ్చునని ఆయన అంచనా వేస్తున్నారు. నిఫ్టీ తక్షణ మద్దతు స్థాయిగా 16,590 మరింత దిగజారితే 16,490-16,360 వరకు ఉంటుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement