న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముయే కాదు. ఎవరున్నా తాము వ్యతిరేకిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తేల్చి చెప్పారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు సీపీఐ మద్దతివ్వడంపై ఆయన స్పందించారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో నారాయణ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును అడ్డం పెట్టుకుని బీజేపీ గిరిజనుల ఓటు బ్యాంకు మీదే కన్నేసిందని చెప్పుకొచ్చారు. దేశాధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా అని నారాయణ మండిపడ్డారు. రాష్ట్రపతి పదవికి పోటీ పడే అభ్యర్థుల గుణగణాలు, ఇతర అర్హతల గురించి చెప్పాలే తప్ప కులం ఆధారంగా అభ్యర్థిగా నిలబెడతారా అంటూ ప్రశ్నించారు. ఇది నిజంగా బీజేపీకి సిగ్గుచేటని విమర్శించారు.
“మహా” సంక్షోభానికి మోదీయే కారణం..
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీయే కారణమని నారాయణ ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం తీరు దుర్మార్గమన్నారు. ఆరెస్సెస్, బీజేపీ, విశ్వహిందు పరిషత్ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటి నాయకత్వం వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టే దుష్టపన్నాగం జరుగుతోందని, బీజేపీ సంకుచిత రాజకీయ ప్రభావం మహారాష్ట్రపై పడిందని అన్నారు. నియంతృత్వ ధోరణితో సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందన్న ఆయన… గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసిందని గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని చెప్పారు. అందులో భాగంగానే శివసేన నేత సంజయ్ రౌత్‌కి ఈడీ నోటీసులిచ్చిందని నారాయణ వివరించారు. ఈడీ వందకు 150 శాతం బ్లాక్ షీప్, ఈడీ పనికిమాలిన విభాగమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈడీ అధికారులు గొర్రెల మందని, మోదీ ఏం చెప్తే అది చేస్తారని విమర్శించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. బీజేపీ పని దేశాన్ని పాలించడమా లేక ప్రత్యర్థి ప్రభుత్వాలను అస్థిరపరచడమా అని నారాయణ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.