Thursday, November 21, 2024

బీజేపీ అబద్ధాలను బయటపెడితే అరెస్టు చేయడమేనా? జర్నలిస్టు జుబేర్​ అరెస్టు బాధాకరం..

ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మొహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన చేసిన ఓ ట్వీట్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఆ ట్వీట్​ ఉండడంతో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ మేరకు జుబేర్‌ను కస్టడీకి తలించారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 153, 295 ఏ కింద కేసు నమోదు చేశారు. అయితే మహ్మద్ జుబేర్‌‌ని అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీతో సహా సీనియర్ ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఈ మేరకు రాహుల్ గాంధీ ఓ ట్వీట్ కూడా చేశారు. “బీజేపీ ద్వేషం, మతోన్మాదం, అబద్ధాలను బయటపెట్టే ప్రతి వ్యక్తి వారికి ముప్పు. నిరంకుశత్వంపై సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే మొహ్మద్ అరెస్ట్‌ను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఖండించారు. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ముస్లిం వ్యతిరేక మారణ హోమ నినాదాల గురించి ఢిల్లీ పోలీసులు ఏం చేయరు కానీ, ఇలాంటి విషయాల్లో చాలా వేగంగా స్పందిస్తారని ట్వీట్ చేశారు.

ఇదే అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కూడా స్పందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ జర్నలిస్టుల్లో ఒకరైన జుబేర్‌ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ అబద్ధాలను బయటపెడుతున్నవారిని అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ఇక రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ కూడా జుబేర్ అరెస్ట్‌ను వ్యతిరేకించారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం నేరం కాదు కానీ అలాంటి ప్రసంగాలను బహిర్గతం చేయడం నేరపూరిత చర్యలు అందుకే జుబేర్‌ను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement