ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : రైతుల రుణ మాఫీ విషయంలో తాను మాటకు కట్టుబడి ఉంటానని, ముందు పేర్కొన్నట్లుగా రైతన్నలకు రుణ మాఫీ చేసినట్లయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు మాజీ మంత్రి హారీశ్ రావు. నేడు ఆయన హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ, ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతు రుణ మాఫీ మార్గదర్శకాలలో రేషన్ కార్డుల ఉన్న వారికే రుణమాఫీ చేస్తామనడం సబబు కాదన్నారు. రైతు లందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, అలాంటప్పుడు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పాస్ బుక్‌లను ప్రామాణికంగా తీసుకుని రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. గతంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. మాటలకు, చేతలకు ఈ ప్రభుత్వానికి పొంతన లేదని… రుణమాఫీ చేయకపోతే తాము రైతుల తరపున ఆందోళన చేస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని హెచ్చరించారు.