కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆదివారం రాజస్థాన్‌లోని జలోర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. తొలుత దక్షిణాది నుంచి కేసీ వేణుగోపాల్, తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇప్పుడు మరో నేత రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారని సోనియాగాంధీని ఉద్దేశించి మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు.
నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేని నేతలు కొందరికి రాజ్యసభకు వెళ్లేందుకు రాజస్థాన్ అడ్డాగా మారిందన్నారు. ‘కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉంది. ఒకప్పుడు ఆ పార్టీ 400 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు కనీసం 300 సీట్లలో పోటీ చేయడానికి వాళ్లకు అభ్యర్థులే దొరకడం లేదు. తప్పులు చేసి చేసి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో అవకాశవాద కూటమి ఒకటి ఏర్పాటు చేశారు. కూటమిలోని పార్టీలే 25 శాతం సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. కాగా, జలోర్‌లో లోక్‌సభ ఎన్నికల రెండో దశలో భాగంగా పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది.