Monday, November 18, 2024

జెలెన్‌స్కీ లొంగుతానన్నా అంగీకరించం.. చంపడం తప్ప మరో మార్గం లేదు : రష్యా

క్రెవ్లిున్‌పై డ్రోన్‌ దాడి ఘటన అనంతరం ఉక్రెయిన్‌- రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హతమార్చాలనే లక్ష్యంతో జరిపిన డ్రోన్ల దాడి వెనుక అమెరికా హస్తముందని రష్యా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ”ఎక్కడెక్కడ దాడి చేయాలో ఆ లక్ష్యాలను అమెరికా ఎంపిక చేస్తుంది. వాటిని ఉక్రెయిన్‌ అమలు చేస్తోంది. ఆ యత్నాల గురించి రష్యాకు తెలుసుని వాషింగ్టన్‌ తెలుసుకోవాలి. వీటన్నింటికీ ప్రతీకారం తీర్చుకునే హక్కు రష్యాకు ఉంది. రష్యా దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుత దాడిపై తక్షణ విచారణ జరుగుతోంది” అని క్రెవ్లిున్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రోన్లు దాడి ఘటనపై అత్యున్నత దర్యాప్తు కొనసాగుతోంది, కుట్రదారులెవరు, పాత్రదారులెవరో త్వరలో వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.

రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌ దిమిత్రి మెద్వెదేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని, అతని సమూహాన్ని చంపడం తప్ప మరో మార్గం రష్యాకు లేదు. పుతిన్‌ను అంతమొందించడానికి చేసిన దాడి తర్వాత జెలెన్‌స్కీని భౌతికంగా తొలగించడం తప్పా మాకు మరో మార్గం లేదు. జెలెన్‌స్కీ బేషరతుగా లొంగిపోయేందుకు సంతకం చేయాల్సిన అవసరం కూడా లేదు” అని టెలిగ్రామ్‌ చానెల్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

”15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని చర్చలు ద్వారా సమస్యను పరిష్కరించుకుందామన్న ఆలోచన కీవ్‌కు లేదు… రెచ్చగొట్టే చర్యలకే ప్రాధాన్యత ఇస్తోంది. దీని వల్ల సమస్య మరింత జఠిలమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

బంకర్‌లోకి పుతిన్‌ తరలింపు..

క్రెవ్లిున్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించడంతో అధ్యక్షుడి భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమైంది. దాంతో పుతిన్‌ను బంకర్‌లోకి తరలించారు. ఆయనకు చెందిన నోవో-ఒగరెవో ప్రాంతంలోని నివాసంలో ఈ బంకర్‌ను నిర్మించారు. అధ్యక్షుడు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని స్థానిక మీడియా వెల్లడించింది. మరోపక్క ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకుపోయిందన్న ఆరోపణలపై కొద్దినెలల క్రితం పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ న్యాయస్థానాన్ని జెలెన్‌స్కీ సందర్శించడం గమనార్హం.

పుతిన్‌ను విచారణకు తీసుకురావాలి..

ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు విచారణకు తీసుకురావాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. గురువారంనాడు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని సందర్శించిన సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ… ”న్యాయానికి ఉన్న శక్తి ఏంటో ఆ దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తిని తెలియజెప్పాలి. ఇది మనందరి చారిత్రక బాధ్యత” అని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు… 21మంది మృతి..

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దక్షిణ ఖేర్సన్‌ ప్రాంతంపై రష్యా క్షిపణులతో దాడులు చేసింది. ఈఘటనలో 21 మంది మరణించడంతోపాటు 48 మంది గాయపడ్డారు. ఖేర్సన్‌ నగరంతోపాటు నగరం చుట్టుపక్కల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో రైల్వే స్టేషన్‌, క్రాసింగ్‌, ఇళ్లు, హార్డ్‌వేర్‌ దుకాణం, ఒక కిరాణా సూపర్‌ మార్కెట్‌, గ్యాస్‌ స్టేషన్‌ ధ్వంసమైనట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలో రెండు పేలుళ్లు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉక్రెయినియన్‌ వైమానిక రక్షణ దళం లక్ష్యంగా పేలుళ్లు జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement