Thursday, September 12, 2024

AP: సిద్దేశ్వరం అలుగు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం – నితిన్ గడ్కరీ హామీ 

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : ప్రతిపాదిత తీగల వంతెన స్థానంలో రాయలసీమ నీటి సమస్యకు కీలక పరిష్కారం అయిన సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. మదనపల్లి పర్యటనకు వచ్చిన ఆయన ఈరోజు మధ్యాహ్నం తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు.ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి పలువురు అధికార, అనధికార ప్రముఖులతో పాటు తిరుపతి లోక్ సభ సభ్యుడు గురుమూర్తి స్వాగతం పలికారు. విమానాశ్రయం లాంజీలో పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.

అందులో ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన సిద్దేశ్వరం అలుగు ప్రాధాన్యత, ఆవశ్యకత గురించి, కృష్ణానదిపై సిద్దేశ్వరం వద్ద నిర్మించ తలపెట్టిన తీగెల వంతెన స్థానంలో అలుగు (బ్యారేజీ) నిర్మించాల్సిన అవసరాన్ని వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. అందులో ముఖ్యంగా 315 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్ట్ లో పూడిక కారణంగా 200 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే దుస్థితి ఉన్నదని తెలిపారు.

ఈ దశలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే మరో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన తీగల వంతెన గురించి ప్రస్తావిస్తూ ఆ వంతెన స్థానంలో అలుగు నిర్మాణం చేపడితే 50టీఎంసీల నీరు నిల్వచేసి పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాజెక్టులకు నీరు అందించే అవకాశం ఉంటుందని వివరించారు. అన్ని అంశాలను విన్న మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ.. ఇందులోని సాధ్యాసాధ్యాలను పరిశీలించమని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, ఆయన దృష్టికి తీసుకువెళ్లిన గురుమూర్తి, రాయలసీమ మేధావుల ఫోరమ్ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement