న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భాగ్యనగర ప్రజల ఆవేదనకు ముగింపు పలికే బాధ్యతను అధిష్టానం తనపై ఉంచిందని హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, విరించి హాస్పిటల్స్ ఛైర్‌పర్సన్ కొంపెల్ల మాధవీలత స్పష్టం చేశారు. మొదటి జాబితాలోనే పేరు ప్రకటించడంతో బీజేపీ పెద్దలను కలిసేందుకు ఆదివారం ఆమె ఢిల్లీ వచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌తో పాటు మరికొందరు నేతలను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
తరుణ్ చుగ్ ఆమెకు కాషాయ కండువా కప్పి, కమలాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాధవీలతకు దిశానిర్దేశం చేశారు. ప్రతిఒక్కరినీ కలుపుకుపోవాలని సూచించారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. నారీశక్తిని, మాధవీలత చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, హిందూ ధర్మ సేవలను గుర్తించి బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
దశాబ్దాలుగా ఓవైసీలు కైవసం చేసుకుంటున్న హైదరాబాద్ స్థానంలో ఈసారి బీజేపీ విజయకేతనం ఎగురవేయాలని ఆమెకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం మాధవీలత ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడారు. హైదరాబాద్ నియోజకవర్గం ఓవైపీల కంచుకోట కాదని, అది మట్టికోటని ఆమె అభివర్ణించారు. అసాధ్యం అనుకుంటే మనదేశానికి స్వాతంత్ర్యమే వచ్చేది కాదని అన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఈసారి అక్కడ గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. 8 లక్షల మంది హిందువులందరూ ఒక్కటైతే గెలవడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు.
పాతబస్తీవాసుల కన్నీళ్లు చూసి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేస్తున్నానని అన్నారు. ఇది తాను ఎంచుకున్న ధర్మ మార్గమని మాధవీలత అన్నారు. ఎంఐఎంను 40 ఏళ్లుగా హైదరాబాద్ ప్రజలు భరిస్తూ వచ్చారని, ఇప్పుడు వారి ఓపిక నశించిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నియోజకవర్గంలోని ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని చెప్పుకొచ్చారు. అక్కడ ఎక్కువగా బోగస్ ఓట్లే ఉన్నాయని, ఓవైసీకి అంతగా ప్రజాదరణ ఉంటే నకిలీ ఓట్ల అవసరమేంటని ప్రశ్నించారు.
బీజేపీలో మగాళ్లే లేరా? మహిళకు సీటు ఇవ్వడమేంటని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల మీదా ఆమె స్పందించారు. ఒక కుటుంబం అన్నాక ఎన్నో అభిప్రాయ బేధాలు ఉంటాయని, ఏదైనా సమస్య వస్తే అందరూ ఒకటేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ సీట్ ఆశించిన రాజాసింగ్ తన తమ్ముడేనని, తమ్ముడి మాటల్ని అక్క పట్టించుకోదని నవ్వుతూ అన్నారు. పార్టీ క్యాడర్ అంతా తనకు అండగా నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సనాతన, హైందవ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని మాధవీలత స్పష్టం చేశారు.