న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి తేల్చి చెప్పారు. ఢిల్లీ వచ్చిన ఆయన శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. సీట్ల కేటాయింపుపై చర్చించారు. తనకు నల్గొండ పార్లమెంట్ సీటు, తన కొడుకులు జయవీర్‌కు నాగార్జున సాగర్, మరో కొడుకు రఘువీర్‌కు మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆయన ఖర్గేను కోరినట్టు సమాచారం.
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం కుటుంబంలో ఒక్కరికే సీటు అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు వంటి కొందరు సీనియర్ నేతలకు మినహాయింపునిస్తుండడంతో జానారెడ్డి తనతో పాటు తన ఇద్దరు కొడుకులకు టికెట్లు ఆశిస్తున్నారు. ఖర్గేతో సమావేశం అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను లోక్‌సభకు పోటీ చేసేందుకు ఇంకా సమయం ఉందన్నారు. అసెంబ్లీకి తమ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు.