ఏపీ రాజకీయాల్లో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం తిప్పిన చంద్రబాబు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆ ప్రాభవం కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాకుండా.. ఆ పార్టీలో ఇప్పుడు ముగ్గురు కీలక నేతల మధ్య పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్‌ని ఆ పార్టీ జీవతకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు చంద్రబాబును టీడీపీ ఎన్నుకోగలదా? లేక పోటీలో లోకేష్, బాలయ్య ఉంటారా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో వైఎస్ జగన్ సంచలనం రేపారు. అందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన పార్టీ ప్లీనరీ వేదిక అయ్యింది. చాలా ప్రాంతీయ పార్టీలకు జీవితకాల అధ్యక్షులు ఉన్నప్పటికీ.. దానిని బహిరంగంగా ప్రకటించే ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ, జగన్ జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే బాట పట్టి పార్టీకి జీవితకాల అధ్యక్షుడిగా చంద్రబాబుని ప్రకటిస్తే ఎలా ఉంటుందని చాలామంది క్వశ్చన్ రేయిజ్ చేస్తున్నారు.
అయితే.. దీని గురించి తెలుగుదేశం గతంలో ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు కూడా జీవితకాల పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకుంటారా? అనే చర్చ కూడా సాగుతోంది. నిజానికి 1995 నుంచి చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా నాలుగు ప్రాంతీయ పార్టీలున్నాయి. అవి టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన.. ఈ నాలుగు పార్టీలకు ఆచరణాత్మకంగా ప్రారంభం నుండి ఒకే అధ్యక్షుడు ఉంటూ వస్తున్నారు.
కాగా,ప్రతిసారి ఎన్నిక నిర్వహించడం ఆ తర్వత పార్టీ అధ్యక్షుడుని ఎన్నుకోవడం ఎందుకని ఏకంగా జగన్‌ను జీవితకాల అధ్యక్షుడిగా ఉండాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఇక ఆ పార్టీ విషయానికొస్తే.. అత్యున్నత అధికారం జగన్‌దే. ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. కానీ, టీడీపీలో ఒకప్పుడు ఏమోకానీ, ఇప్పుడు అట్లా కాదు. వైఎస్సార్సీపీకి భిన్నంగా టీడీపీలో కనీసం మూడు భిన్న ధృవాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకటి చంద్రబాబు, రెండోది లోకేష్, మూడు నందమూరి బాలకృష్ణ.. ఇట్లా టీడీపీలో ఈ ముగ్గురు నేతల మధ్య పోటీ ఉంటుందా? లేక చంద్రబాబుకు జీవితకాల అధ్యక్షుడిగా సానుకూల పరిస్థితులు ఉంటాయా? అన్నది చూడాలంటే కాలమే నిర్ణయిస్తుందని, దానికోసం వెయిట్ చేయాల్సిందే తప్పా ఏం చేయలేమని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.