Tuesday, November 19, 2024

కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడా? : మంత్రి హ‌రీష్ రావు

మర్రిగుడెం : మండలం రాజుపేట తండాలో గ్రామస్థులతో సమావేశమైన మంత్రి హరీష్ రావు… స్థానిక సమస్యలపై ప్రజలతో మాటా మంతి జ‌రిపారు. తండా వాసులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ముక్త కంఠంతో తెరాసాకు ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారు, ప్రజలు చాలా తెలివైన వారు అన్నారు. మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ బాధలు తీర్చడానికి కేసీఆర్ ప్రతిన పునారు అన్నారు. కెసిఆర్ ఫ్లోరైడ్ బాధలు తీర్చారు, ఇందులో బీజేపీ వాళ్ళ పాత్ర ఏమైనా ఉన్నదా అన్నారు. నీతి అయోగ్ ఒక్క పైసా ఇవ్వలేదు, కానీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కేంద్ర నిధులు అని.. ఏ సంక్షేమ పథకంలో ఒక్క పైసా కేంద్రానిది ఉన్నదా అని ప్ర‌శ్నించారు.

అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చేస్తున్నారు. ఇప్పటికే తాగు నీరు ఇచ్చారు. త్వరలోనే శివాన్నగుడెం రిజర్వాయర్ ను పూర్తి చేసి భూమిలోని ఫ్లోరైడ్ ను తరిమి కొడతాం అన్నారు. కృష్ణా జిల్లాలో వాట తేల్చని బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేస్తు, కృష్ణా జలాల్లో నీళ్ళ వాటా తేల్చాల‌న్నారు. కేంద్రం నిరుద్యోగులను మోసం చేస్తున్నది, లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే అన్నారు. రక్షణ శాఖలో కూడా అగ్ని పత్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటున్నారు, ఉన్న ఉద్యోగాలు ఊడబీకుతున్నరు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసే కార్యక్రమం కేంద్రం ముమ్మరం చేసింద‌న్నారు. బీజేపీ అధికారంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. బీజేపీ వచ్చాక దేశంలో ఆకలి పెరిగింది. 107 స్థానంలో పేదరికం మనది. నేపాల్ పాకిస్థాన్ కంటే వెనకబడి పోయింది అన్నారు. ఇంత కంటే సిగ్గు చేటు ఏముంటుంది. గల్లిగల్లిలో తిరిగే బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగాలి ఈ డబ్బుల గురుంచి. రైతు బంధు ప్రయోజనం అత్యధికంగా మునుగోడుకే ప్రయోజనం అన్నారు. ఒక వేళ బిజేపి గెలిస్తే… మన బావి కాడికి మీట‌ర్లు వస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి అని హ‌రీష్ రావు సూచించారు.

మర్రిగూడ రాజ్ పేట్ తండాలో మంత్రి హరీశ్ రావు
మా తండాలు మాకు కావాలని కోరుకున్నారు మన గిరిజన సోదరులు.. గ్రామ పంచాయితీలు కావాలని కోరుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మాట తప్పారు. కేసీఆర్ తండాలను గ్రామా పంచాయితీలుగా చేయడం వల్ల మొత్తం 3146 మంది సర్పంచులు అయ్యారు. ఎమ్మెల్యేగా చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ నాలుగేళ్ళలో ఒక్కసారి అయినా మీ గ్రామానికి వచ్చిండా,
ఈ ఎన్నిక ఎవరికోసం ఎందుకోసం వచ్చింది ఎవరి స్వార్థం కోసం వచ్చింద‌న్నారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం లాభం లేదు.. మళ్లీ టీఆర్ఎస్ ను తిట్టడం తప్ప ఇంకేమైనా చేస్తాడా? అన్నారు. మద్యంతో, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలను మర్రిగూడ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎంబీబీఎస్ లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ తెచ్చాం. 6615 ఎంబీబీఎస సీట్లలో 661 సీట్లు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి అన్నారు. విద్యలో, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్.. గిరిజనులకు మంచి అవకాశాలు కలుగుతాయి అన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఏడాదిలోపు ఇచ్చిన మాటలన్ని అమలు చేస్తాం, ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత నాది అన్నారు. బీజేపీ గెలిస్తే 3000 పెన్షన్ ఇస్తారా? మోడీ సొంత రాష్ట్రం బీజేపీలో 700 పెన్షన్ ఇస్తున్నారు, బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో 600 పెన్షన్ ఇచ్చేవాళ్లు, తెలంగాణలో 3000 ఇస్తారంట ఎలా అని ప్ర‌శ్నించారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజుల చేపిస్తా అన్నాడట.. రాజగోపాల్ రెడ్డి అసుంటోడు అని మండిప‌డ్డారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3000 పెన్షన్ ఇచ్చి తెలంగాణకి వచ్చి ఈ మాటలు చెప్పండి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు కరెంట్ ఇచ్చింది. రూ.200 పెన్షన్ రూ.2000 అయింది. రైతుబంధు, రైతుభీమా, ఎవరు తెచ్చారు కేసీఆర్ కాదా? టీఆర్ఎస్ కాదా? అన్నారు. భూమికి బరువైన పంట పండుతోంది. తెలంగాణలో గింజ మిగలకుండా కొన్నాం అని గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మీ, కేటీఆర్ కిట్ ఇవన్నీ మీ కండ్ల ముందే జరుగుతున్నా నిజాలు కావా? అన్నారు. 1000 ఇళ్లు ప్రభుత్వం ఇచ్చినా.. కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదు. కాంగ్రెస్ పార్టీ లేకుండానే పోయింది, బీజేపీ మందు సీసాలు, పైసలు ఇచ్చి ఓట్లు కొనాలని చూస్తున్నారు. కనపడని మనిషి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకంటారా? అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ని గెలిపిస్తారా? అన్నారు. ఆగం కాకుండా మొదటి డబ్బా మీద 2 నంబర్ బటన్ కారు గుర్తు ప్రభాకర్ రెడ్డి ఫోటో మీద ఓటు వేసి దీవించండి, నా బాధ్యత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని మంత్రి హ‌రీష్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement