ఇప్పటికే 27 వేల ఏకరాల పరశురామ ప్రీతి
అయిదుగురు వ్యక్తులు మృతి
అగ్నకీలల్లో సెలబ్రిటీల ఇళ్లు
అత్యవసర పరిస్థితి విధించిన ప్రభుత్వం
లాస్ ఏంజిల్స్, ఆంధ్రప్రభ: సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజెల్స్‌ను కార్చిచ్చు వణికించింది. వరుసగా రెండో రాత్రి కూడా అక్కడి అడవులు అంటుకున్నాయి. బిలియనీర్లు నివసించే పసిఫిక్ పాలిసేడ్స్‌తో పాటు పలు చోట్ల కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. దీంతో తీవ్ర నష్టం జరిగింది. ఈ కార్చిచ్చు వల్ల అయిదుగురు మృతిచెందారు. అయిదు చోట్ల మంటల వల్ల సుమారు 27 వేల ఎకరాల అడవి దగ్ధం అయింది. ఈ కార్చిచ్చుకు ప్రభావితమైన పదివేల మందిలో నటులు, సంగీతకారులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. పాలిసాడ్స్, ఈటన్ తదితర ప్రాంతాల్లో గాలి వేగం చాలా ఎక్కువగా ఉండటంతో అటవీ మంటలు అదుపులోనికి రావడంలేదు. గడచిన 24 గంటల్లో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలోని గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల నుండి 70 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇళ్లను విడిచిపెట్టిన పదివేల మంది
పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కాలిఫోర్నియా ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు. చాలా మంది తమ సామగ్రి, వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అటవీ మంటల నుంచి వెలువడుతున్న పొగ ఆకాశాన్నంతా కమ్మేసింది. పరిస్థితిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు .
వందల మీటర్ల మేర ఎగిరిపడుతున్న నిప్పురవ్వలు
హాలీవుడ్ ప్రముఖులు అమితంగా ఇష్టపడే కాలిఫోర్నియాలోని రియల్ ఎస్టేట్ నేలమట్టమయ్యింది. బలమైన గాలులు మంటలను మరింతగా వ్యాపింపజేశాయి. వందల మీటర్ల మేరకు నిప్పురవ్వలు ఎగిరి పడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంథోనీ మర్రోన్ తెలిపిన వివరాల ప్రకారం మంటలు విస్తరిస్తున్న తీరు అగ్నిమాపక సిబ్బంది కే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినప్పటికీ సిబ్బంది ఏమాత్రం వెనక్కి తగ్గక అగ్నికీలలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
చుట్టుపక్కల ప్రాంతాలకు అగ్నికీలలు
పసిఫిక్ పాలిసాడ్స్‌లో చెలరేగిన మంటలు దాదాపు 27 వేల ఎకరాలను దగ్ధం చేశాయి. వెయ్యి ఇళ్లు , వ్యాపార స్థలాలు నాశనమయ్యాయి. నగరానికి ఉత్తరాన ఉన్న అల్టాడెనా సమీపంలోని 10,600 ఎకరాల అడవులు తగలబడిపోతున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మీడియాతో మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదాల్లో తొలుత ఇద్దరు మరణించారని, మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శాన్ ఫెర్నాండో వ్యాలీలో మాత్రం కార్చిచ్చును అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది సక్సెస్ అయ్యింది. ఈటాన్ సిటీలో అయిదుగురు మృతిచెందారు. నగరం నుంచి సుమారు 1.37 వేల మంది ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక మంది హాలీవుడ్ సెలబ్రిటీల ఇండ్లు కూడా దగ్ధం అయ్యాయి.