Friday, November 22, 2024

సైబరాబాద్‌లో విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్‌ తనిఖీలు.. మైనర్ల డ్రైవింగ్‌పైనా ప్రత్యేక నిఘా !

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : మద్యం తాగి కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడిపేవారూ.. ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందేనని ట్రాఫిక్‌ పోలీసులు మరోసారి సూచిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే, పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే మూడు నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో సైబరాబాద్‌ వ్యాప్తంగా ట్రాఫిక్‌ పోలీసులు దీనిని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌లో చిక్కిన వారి వివరాలు కోర్టుకు అందజేసి, లైసెన్స్‌ రద్దు చేయాలని అభ్యర్థిస్తూ రవాణాశాఖకు సిఫారసు చేయనున్నారు. అంతేకాదు మద్యం మత్తులో ప్రమాదాలు పెరుగుతుండడంతో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలనూ సైతం పెంచేందుకు రెడీ అవుతున్నారు.

మైనర్లు బైక్‌ నడిపితే కఠిన చర్యలు..

బైకులు.. కార్లు వేగంగా నడుపుతూ వెళ్తున్న మైనర్లపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కార్లను వేగంగా నడిపి ప్రమాదాలు చేయడంతో అత్యాచారయత్నాలకు కార్లు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడినా.. సీసీకెమెరాలకు చిక్కినా వారిపై కేసులు నమోదు చేయనున్నారు. మైనర్‌ ఘటనలపై చట్టపరంగా వ్యవహరించాలని, మైనర్లపై కోర్టుల్లో అభియోగపత్రాలు సమర్పించాలని అధికారులు ఆదేశించారు. మైనర్లపై నిఘా పెట్టి, వారు డ్రైవింగ్‌ కు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలను సైతం విస్తృతం చేయాలని కోరారు. ఎవరూ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినా వారిపై కఠినంగా వ్యవహరించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement