Friday, November 22, 2024

Delhi | మూణ్ణెళ్లలో పోయేదానికి రాష్ట్రపతి పాలన ఎందుకు?.. తెలంగాణ సర్కారుపై కిషన్ రెడ్డి కామెంట్స్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదని, నిజాం రాజ్యాంగం అమల్లో ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన బుధవారం సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ, అపహాస్యం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగ వ్యవస్థలపై, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని అన్నారు. చివరకు గణతంత్ర దినోత్సవాలను కూడా రద్దు చేసే వరకు వెళ్లారని ఆరోపించారు.

గతంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు సీఎం కేసీఆర్ పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ గణతంత్ర వేడుకలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు మధ్య విబేధాలు, స్పర్థలున్నాయని, కానీ ఇంత దిగజారి ఎవరూ ప్రవర్తించలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జీ-20 సన్నాహక సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించినప్పటికీ హాజరుకాలేదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చినా కనీస మర్యాద లేదని అన్నారు. భారత రాష్ట్రపతి వచ్చినా, మరెవరు వచ్చినా ఇదే తీరు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణ నదీజలాల వివాదాలను పరిష్కరించడం కోసం సమావేశం ఏర్పాటు చేసినా కేసీఆర్ హాజరుకావడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఆయన కారణంగా తెలంగాణ రాష్ట్రం పరువు పోతోందని అన్నారు. దేశానికి ఒక విధానం తెలంగాణకు ఒక విధానం ఉండదని, ఎవరైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. వితండవాదం, కల్వకుంట్ల విచిత్ర వాదంతో వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎవరు ధర్నాలు చేయాలన్నా, నిరసన ప్రదర్శన చేపట్టాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఒక దశలో ప్రతి విషయానికి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితిని చూసి ధర్మాసనం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు.

- Advertisement -

చివరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం కోసం కూడా ప్రజలు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కిషన్ రెడ్డి అన్నారు. దీన్ని బట్టే సీఎం కేసీఆర్ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా గవర్నర్ ఎవరున్నా కనీస మర్యాదలు, సాంప్రదాయాలు పాటిస్తారని, కానీ కేసీఆర్ మాత్రమే దిగజారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించకుండా చేయడం కోసం సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా కొనసాగిస్తూ వస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు.

కేసీఆర్ తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారని, అందుకే గుణాత్మక మార్పు అంటూ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా దిగజారిపోయిందని, అవినీతిమయం అయిందని అన్నారు. డబ్బుతో ఎవరినైనా కొనొచ్చు, రాజకీయం చేయవచ్చు అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆ రకంగా తెలంగాణ సమాజం తన కుటుంబానికి బానిసల్లా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఈ మధ్య నిర్వహించిన సర్వేల్లో ప్రజల్లో వ్యతిరేకతను కేసీఆర్ గమనించారని, ఆ వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇలా వ్యవహరిస్తున్నారని సూత్రీకరించారు.

ఒకప్పుడు రాజ్యాంగాన్నే మార్చేయాలి అన్న కేసీఆర్, అందుకు తగినట్టుగానే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని, నిజాం రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. తాము విధానాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై మాత్రమే విమర్శలు చేస్తున్నామని, కానీ టీఆర్ఎస్ నేతలు ప్రతిరోజూ నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ విషయంలో, గణతంత్ర దినోత్సవం విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తుందా అన్న ప్రశ్న లేవనెత్తగా.. “మూణ్ణెళ్లలో పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకు? ఎలాగూ పోయే ప్రభుత్వమే కదా?” అని బదులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement