Thursday, November 21, 2024

బాబు-పవన్ భేటీపై కంగారెందుకు..? కందుకూరు, గుంటూరు ఘటనల వెనుక ప్రభుత్వ కుట్ర : కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీపై వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్-బాబు భేటీపై ఎందుకు ఉలిక్కిపడుతున్నారో చెప్పాలని అన్నారు. ప్రధాని మోదీతో ఏం చర్చించారో మీరైతే చెప్పరు కానీ బాబు-పవన్ భేటీలో ఏం చర్చించారో మేం చెప్పాలా అంటూ వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బాబు-పవన్ భేటీ జరిగిన మరుక్షణం నుంచే రాష్ట్ర మంత్రివర్గంలో సగం మంది మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు కందుకూరు, గుంటూరు ఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో పాటు కుట్ర కోణం దాగి ఉందని కనకమేడల ఆరోపించారు. చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక దుర్ఘటనలకు ఆస్కారం కల్గించేలా ప్రభుత్వమే కుట్రలకు పాల్పడిందని ఆయన విమర్శించారు.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని, బ్రిటీష్ కాలంలో తప్ప ఇలాంటి నిషేధాజ్ఞలు ఎక్కడా చూడలేదని చెప్పారు. కందుకూరు ఘటనను సాకుగా చూపుతూ ఈ జీవో తీసుకొచ్చి చంద్రబాబు సభలను అడ్డుకుంటున్నారని, తన సొంత నియోజకవర్గంలో సైతం పర్యటించడానికి వీల్లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement