ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు నాటో కూటమి మరోసారి తెరపైకి వచ్చింది. 1991లో సోవియట్ యూనియన్ కాల గర్బంలో కలిసిపోయిన తర్వాత ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. అయితే భద్రతాపరంగా ఉక్రెయిన్ రిపబ్లిక్, రష్యాకు కీలకప్రాంతం. అమెరికా ఆధిపత్యంలో ఉన్న నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరుతుందన్న ప్రచారం కొంతకాలంగా జోరందుకుంది. నాటో సైనిక కూటమిలో చేరాల్సిందిగా ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు రష్యాకు స్పష్ట మైన సమాచారం అందింది. దీంతో రష్యా అప్రమత్తమైంది. వాస్తవానికి ఉక్రెయిన్ నాటో కూటమి సభ్యదేశం కాదు. భాగస్వామ్య దేశం మాత్రమే. నాటో కూటమిలో ఉక్రెయిన్ సభ్య దేశంగా చేరితే రష్యా భద్రత ప్రమాదంలో పడ్డట్టే. ఎందుకంటే సభ్యదేశం కావడంతో అక్కడ నాటో సైనిక దళాలు తిష్టవేయవచ్చు. అంతే కాదు క్షిపణులను కూడా మోహరించవచ్చు. రష్యాలోని ఏ ప్రాంతాన్ని అయినా టార్గెట్ చేసి ఉక్రెయిన్ నుంచి క్షిపణులను ప్రయోగించవచ్చు. అలా క్షిపణులను ప్రయోగిస్తే కొన్ని నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరుకుంటుంది. అంటే భద్రతాపరంగా రష్యా ప్రమాదంలో చిక్కుకున్నట్లే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో రష్యా చర్యలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వివాదానికి మూలాలు పరోక్షంగా నాటో కూటమితో ముడిపడి ఉన్నాయి.
నాటో అంటే.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో ఏర్పాటు అయింది. ఇది ఒక సైనిక కూటమి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికాతో పాటు కొన్ని యూరప్ దేశాలు కలిసి నాటో కూటమిని ఏర్పాటు చేసుకున్నా యి. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న కాలంలో ఈ కూటమి ఏర్పాటైంది. నాటోలో మొదట పన్నెండు సభ్య దేశాలు ఉండేవి. 1997 నుంచి నాటో కూటమి విస్తరణపై అమెరికా ఫోకస్ పెట్టింది. దీంతో ప్రస్తుతం నాటో కూటమి సభ్య దేశాల సంఖ్య ముప్ఫయికి చేరింది. అవసరమైనప్పుడు నాటోలోని సభ్యదేశాలన్నీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కూటమి ఏర్పాటులో ఉన్న మౌలిక సూత్రం ఇదే. అయితే సోవియట్ యూనియన్‌ను విచ్ఛిన్నం చేయడమే నాటో కూటమి ఏర్పాటు వెనుక ఉన్న రహస్య అజెండా అని అప్పట్లో అనేక సోషలిస్టు దేశాలు ఆరోపించాయి. ఈ ఆరోపణల సంగతి ఎలాగున్నా ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక పెను మార్పులు సంభవించాయి. సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరువాత ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. అమెరికా, ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదిగింది. అసలు సోవియట్ యూనియన్ అనేదే అంతరించిన తరువాత నాటో కూటమి అవసరమే లేదన్నది చాలా మంది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం.
అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసే దేశమే ప్రపంచపటంపై లేనప్పుడు నాటో కూటమి ఎందుకన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ ప్రశ్నలను, మేధావుల అభిప్రాయాలను అమెరికా కొట్టిపారేసింది. నాటో కూటమిని కొనసాగించింది. పైపెచ్చు మరింతగా విస్తరించడంపైనే ఫోకస్ పెట్టింది. ఉక్రెయిన్ విషయంలో భారత్ తనకు మద్దతు ఇస్తుందని అమెరికా ఆశించింది. ఈమేరకు భారత్‌పై బోలెడు ఆశలు పెట్టుకుంది. ప్రపంచదేశాల్లో భారత్‌కు ఎంతో గౌరవం ఉంది. ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఇమేజ్ ఉంది. పైపెచ్చు నాలుగు దేశాల క్వాడ్ కూటమిలో అమెరికాతోపాటు భారత్ కూడా సభ్యదేశం. అలాగే చైనాతో మనకు సరిహద్దు గొడవలున్నాయి. చైనా దూకుడును నిలువరించడానికి మనకు అమెరికా మద్దతు అవసరమే. దీనిని ఎవరూ కాదనలేరు. అయితే రష్యాతో కూడా మనకు మొదటి నుంచి మంచి సంబంధాలున్నాయి. అమెరికా మెహర్బానీ కోసం ఇవాళ రష్యాను దూరం చేసుకుంటే అది తప్పకుండా తెలివితక్కువ నిర్ణయం అవుతుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో దేశ ప్రయోజనాలే కీలకం అవుతాయి… అవ్వా లి కూడా. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ వివాదంలో తటస్థ వైఖరికి భారత్ ఓటేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..