Tuesday, November 26, 2024

కేజ్రీవాలే ఎందుకు? ఢిల్లీ మోడల్‌ అభివృద్ధి, ఆప్‌ హామీలపై పంజాబీల ఫిదా!

బీజేపీ కూటమి, కాంగ్రెస్‌, శిరోమణి అకాలీ దళ్‌ ప్రభుత్వాలను పంజాబ్‌ ప్రజలు చూశారు. వారి హయాంలో జరిగిన అవినీతితో పాటు కుటుంబ రాజకీయాలను గమనిస్తూనే వచ్చారు. శిరోమణీ అకాలీ దళ్‌ మునుపటి ప్రాభావం కోల్పోయింది. ఇక కాంగ్రెస్‌లో కుమ్ములాటలు చూస్తూనే వచ్చారు. అమరీందర్‌ సింగ్‌ను బయటికి పంపించడం, దళిత వ్యక్తి చన్నీని సీఎం చేయడం గమనిస్తూ వచ్చారు. ఇక కొత్తగా పోటీ చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే.. అది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఇన్ని పార్టీలను గెలిపిస్తూ వచ్చిన తాము.. ఆప్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందన్న ఆలోచన వారిలో కలిగింది. కేజ్రీవాల్‌ హామీలు ఓటర్లను ఎంతో ఆకర్శించాయి. పెద్ద పెద్ద హామీల జోలికి వెళ్లకుండా.. ఢిల్లిd తరహా పాలన అందిస్తామన్న ఒకే ఒక్క మాటకు పంజాబ్‌ ఓటర్లంతా ఫిదా అయిపోయారు. ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇవ్వకుండా.. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైనే దృష్టి సారించింది ఆప్‌.

ఢిల్లీ తరహా పాలనపై హామీ
డ్రగ్స్‌ మాఫియాను అరికట్టడం, గురు గ్రంథ్‌ సాహిబ్‌ను అవమానపర్చిన వారిని శిక్షించడం వంటి అంశాలు ఆప్‌ హామీల్లో కీలకం. దీంతో పాటు రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం వంటి సమస్యలను దూరం చేస్తామని కేజ్రీవాల్‌ భరోసా ఇచ్చారు. ఇది అక్కడి యువతకు ఎంతో నచ్చింది. 2017లో ఇవే సమస్యల ఎజెండాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే వాటిని అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమైంది. ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలు ఒప్పుకోవడం గమనార్హం. అమరీందర్‌ను పక్కకు పెట్టడం కూడా ఓ కారణం. దీంతో పంజాబ్‌ ప్రజల ఆకాంక్షలనే హామీలుగా చేసుకోవడంలో ఆప్‌ సఫలీకృతమైంది. ఇందులో భాగంగానే డ్రగ్స్‌ మాఫియాను అరికడతామంటూ పలు వేదికలపై కేజ్రీవాల్‌ ప్రస్తావించారు. ఎంతటివారైనా జైలుకు పంపుతామని, మహిళల ఖాతాల్లో వెయ్యి రూపాయలు వేస్తామని, ఢిల్లిd తరహాలో ఉచిత విద్యుత్‌, పాఠశాలల బలోపేతం, ఉచిత వైద్యం అమలు చేస్తామనే అంశాలు పంజాబీలకు ఎంతో నచ్చాయి. అందుకే సరికొత్త పార్టీ ఆప్‌కు అవకాశం ఇవ్వాలనుకున్నారు. దీనికితోడు సాగు చట్టాల విషయంలో ఆప్‌ ప్రభుత్వం రైతులకు ఎంతో అండగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement