న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్లో నిరసన తెలుపుతున్న సభ్యులకు కేంద్ర హోంమంత్రి ఆఫీస్ నుంచి వార్నింగులు ఇస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపే హక్కు పార్లమెంట్ సభ్యులకు లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులెవరూ ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని నారాయణ చెప్పుకొచ్చారు. అసలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న మోదీ ప్రభుత్వమేనన్నారు.
పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన వార్నింగ్‌ను తక్షణమే ఉపసంహరించుకోకపోతే మళ్ళీ పెద్దఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ(గ్రాడ్యుయేట్) ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నారని, పదవ తరగతి సర్టిఫికెట్ ఉన్నవాళ్లు కూడా ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. పదో తరగతి చదివిన వారికి గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇచ్చిన వారి వేళ్లు నరికేయాలని నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు.
కళ ప్రజల కోసం
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని నారాయణ హర్షం వ్యక్తం చేశారు. కళ కళ కోసమే కాదు ప్రజల కోసమని అభిప్రాయపడ్డారు. ద ఎలిఫెంట్ విష్పరర్స్, ‘RRR’ కు ఆస్కార్ అవార్డులు రావడం భారతీయులకు గర్వకారణమన్న ఆయన, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ పోట్లగిత్తల్లా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారని నారాయణ అన్నారు.